Artificial Leaf : కృత్రిమ ఆకులతో మంచినీటిని తయారు చేయొచ్చు.. సైంటిస్టుల వెల్లడి

21 Nov, 2023 15:56 IST|Sakshi

ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యమని నిరూపిస్తున్నారు మన సైంటిస్టులు. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎడారి ప్రాంతంలోనూ మంచినీళ్లు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు. కృత్రిమ ఆకులతో స్వచ్చమైన తాగునీటితో పాటు హైడ్రోజన్‌ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తాగునీరు, ఇంధనం వంటి సంక్లిష్ట ఇబ్బందులకు ఆర్టిఫిషియల్‌ లీఫ్‌ పద్దతి మంచి పరిష్కారమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు వివరించారు. ఆ సరికొత్త ఆవిష్కరణ ఎడారి వంటి ప్రాంతాల్లో సరైన పరిష్కారణమని వారు తెలిపారు. మొక్కలకు నీరు, సూర్యరశ్మే ప్రధాన ఆహారం. గాలిలోని కార్భన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని మొక్కలు మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. అచ్చం ఇదే పద్దతిలో ఇప్పుడు(Artificial Leaf) ఆర్టిఫిషియల్‌ ఆకులను సృష్టించారు. 

ఇవి నిజమైన వాటి మాదిరిగానే ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు). ఇవి నీరు, సూర్యరశ్మిని తీసుకొని ఇంధనంతో పాటు స్వచ్చమైన మంచినీటిని అందిస్తుంది. ప్రపంచంలో సుమారు 1.8 బిలియన్ల మందికి ఇప్పటికి తాగునీరు అందుబాటులో లేదు. ఆర్టిఫిషియల్‌ లీఫ్స్‌ టెక్నాలజీ ద్వారా నీటి సంక్షోభం నుంచి ఉపశమనం పొందొచ్చు.ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. 

ఆర్టిఫిషియల్ లీఫ్‌పై ఉన్న చతురస్రాకారపు గ్రీన్ ఫొటోనోడ్.. సన్‌లైట్‌ను కలెక్ట్ చేస్తుంది. సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఈ కృత్రిమ ఆకుల్లోని కనెక్టెడ్ సిలిండర్స్  సాధారణ మొక్కల థియరీ కిరణజన్య సంయోగ క్రియ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది.ఆర్టిఫిషియల్‌ లీఫ్స్‌ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి ఏకకాలంలో స్వచ్చమైన మంచినీటితో పాటు ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా గాలి కూడా శుభ్రమవుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం.. సంవత్సరానికి మూడు మిలియన్ల మరణాలకు కాలుష్యమే కారణమని తేలింది. ఈ నేపథ్యంలో అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రొఫెసర్ ఎర్విన్ రీస్నర్‌ అన్నారు.వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. 

మరిన్ని వార్తలు