'బిగ్'‌ స్టార్‌ మదర్‌ 

20 Nov, 2020 00:20 IST|Sakshi

జ్యోతిని ‘స్టార్‌’ మదర్‌ అని గానీ.. ‘బిగ్‌’ మదర్‌ అని గానీ.. అనాలి! ఆమె కూతురు హారిక యూట్యూబ్‌ స్టార్‌. అందుకే ఆమె స్టార్‌ మదర్‌. హారిక ప్రస్తుతం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.అందుకే ఆమె బిగ్‌ మదర్‌. సింగిల్‌ మదర్‌గా అయితే మాత్రం.. జ్యోతిని బిగ్‌ స్టార్‌ మదర్‌ అనాలి! ధైర్యంగా నిలబడ్డారు. పిల్లల్ని తన సమాధానంగా పెంచారు.

‘‘నా కూతురు అని చెప్పుకోవడం కాదు గానీ ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తుందో.. అంత హార్డ్‌ వర్క్‌ చేస్తుంది. ఇంటి పరిస్థితులను, నన్ను బాగా అర్ధం చేసుకుంటూ పెరిగింది. ఎవరైనా ఏ కొంచెం తనను ఇన్‌సల్ట్‌ చేసినా గెలిచి చూపాల్సిందే అని పట్టుపడుతుంది’’ అని కూతురు హారిక గురించి చెబుతూ మురిసిపోయారు జ్యోతి. ఆమె సింగిల్‌ మదర్‌. కూతురు అలేఖ్య హారిక, కొడుకు వంశీ కార్తీక్‌తో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రధానంగా సింగిల్‌ మదర్‌గా ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, పిల్లల పెంపకం గురించి ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది. 

చదువు గురించే ఆలోచన
‘‘పిల్లలకు డబ్బు విలువ బాగా తెలుసు. అమ్మ కష్టపడుతుంది. మనం ఇంకా ఎక్కువ కష్టపెట్టకూడదు అనేది ఇద్దరూ చిన్నతనం నుంచీ అర్ధం చేసుకున్నారు. పిల్లలు చదివే స్కూల్‌లోనే టీచర్‌గా చేశాను. బ్యాంక్‌ ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాను. కుటుంబ పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే ఎలాంటి అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందో అన్నీ ఎదుర్కొన్నాను. తప్పనిసరై తొమ్మిదేళ్ల క్రితం ఓ రోజు పిల్లల్తో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ సమయంలో మొదటగా ఆలోచించింది వాళ్ల చదువులు, వాళ్ల ఫీజుల గురించే. గతమేదైనా అది పిల్లల చదువులపై ప్రభావం పడకూడదు అని ఆ రోజే గట్టిగా అనుకున్నాను. 

వేలెత్తి చూపినవారే..!
‘‘నా చేతిలో ఎం.ఏ సర్టిఫికెట్‌ తప్ప మరే ధైర్యమూ లేదు. ఎవరి సాయమూ లేదు. రెండు మూడేళ్లు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాను. దగ్గర ఉన్న కొంత బంగారం కొన్ని రోజులు ఆదుకుంది. సింగిల్‌ మదర్‌గా సమాజంలో వివక్షను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ కష్టం అద్దె ఇంటిని వెతుక్కోవడంతో మొదలైంది. ఎవరో ఒకరి రికమెండేషన్‌ ఉంటే తప్ప ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. పిల్లలు ఎదిగే సమయంలో వేరుపడి బయటికి రావడం అవసరమా అని అన్నవాళ్లూ ఉన్నారు. ఆ మాటలన్నీ పడుతూ కుమిలిపోతుంటే పిల్లలు డిస్టర్బ్‌ అవుతారని అనిపించింది. ఎంత కష్టమొచ్చినా పిల్లల కోసం నిలబడాలని బలంగా అనుకున్నాను. గతంలో చేసిన ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు బొటిక్‌ పెట్టుకోడానికి ఉపయోగపడింది. ఆరేళ్లుగా బొటిక్‌ నడుపుతున్నాను. మొదట్లో వేలెత్తి చూపినవారే.. ఇప్పుడు ‘మా వాళ్లు’ అని మాట్లాడుతుంటారు. సమాజం నన్ను అన్న మాటలన్నిటికీ నా పిల్లలు సరైన సమాధానం ఇచ్చారు అనుకుంటాను.

నా ధైర్యమే వచ్చింది
‘‘ఈ పనే చేయాలి, ఇది చేయకూడదు.. అని నేనెప్పుడూ పిల్లలకు ఆంక్షలు పెట్టలేదు. వాళ్లు అడిగినవన్నీ ఇవ్వగలిగాను. ఏదైనా నా శక్తికి మించినది, అంతగా అవసరం లేదని అనుకున్నదీ అడిగినప్పుడు మాత్రం వాళ్లకు నచ్చచెబుతాను. లేదంటే, వాయిదా వేస్తాను. మెల్లగా వాళ్లే అర్ధం చేసుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ వాళ్లకు కండిషన్స్‌ పెట్టలేదు. వంశీకన్నా హారికకు స్నేహితులు ఎక్కువ. అందరితోనూ బాగుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బాలెన్సింగ్‌గా ఉంటున్నారు. తనూ అలాగే ఉంటుంది. నా బిడ్డలపై అపోహలు, అపనమ్మకాలు, భయాలు.. ఏవీ పెట్టుకోను. ఏ వర్క్‌ చేయాలన్నా ధైర్యంగా మొదలు పెట్టమంటాను. వాళ్లు కూడా నాలాంటి వాళ్లే. ఒకటి అనుకుంటే వెనుకంజ వేయరు. (నవ్వుతూ).

హారిక సర్‌ప్రైజ్‌  
హారిక బిబిఎ మొదటి సంవత్సరంలో ఉన్నప్పటి నుంచీ పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ చేస్తూ వచ్చింది. తనకు నెలకు ఏడు వేల రూపాయలు వచ్చేవి. అందులో రెండు వేలు తను పాకెట్‌మనీగా పెట్టుకొని ఐదు వేలు ఇంటికి ఇచ్చేది. ఆ రెండువేలను కూడా పొదుపు చేసి నా బర్త్‌డేకి ఏదో ఒక బహుమతి తెచ్చి నన్ను సర్‌ప్రైజ్‌ చేసేది. ఇప్పటికీ అదే అలవాటు ఉంది తనకు. నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది. నిజానికి తను కూడా ఎక్కడా యాక్టింగ్‌ క్లాస్‌కు వెళ్లింది లేదు. చిన్నప్పుడు కొంత వరకు సంగీతం నేర్చుకుంది. మోడ్రన్‌ డ్యాన్సులంటే తనకు బాగా ఇష్టం. ఆరేడు గంటలు విరామం లేకుండా డ్యాన్స్‌ చేయమన్నా చేస్తుంది. ఎక్కువ సమయం పిల్లలతో ఉంటుంటాను కాబట్టి ఇద్దరూ వాళ్ల వర్క్‌లో నన్నూ ఇన్‌వాల్వ్‌ చేస్తుంటారు.

ఆ విధంగానే హారిక తను చేసే స్కిట్‌లలోకి నన్నూ తీసుకుంది. వంశీని కూడా. వంశీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. హారిక క్రియేటివ్‌ సైడ్‌ ఎంచుకొని వెళుతోంది. ‘‘ఇంక వర్క్‌ చేయకమ్మా! నీకేం కావాలో చెప్పు.. రెస్ట్‌ తీసుకో’’ అని పిల్లలు అంటుంటారు. ‘‘నేను డిజైన్‌ చేసే దుస్తుల్లో నువ్వింకా మెరవాలి కదా! అప్పుడే రెస్ట్‌ ఎందుకు?’’ అని హరికతో అంటూ నవ్వేస్తాను. పిల్లల పెళ్లిళ్లు గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. తమను అర్ధం చేసుకున్నవాళ్లు, అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా కొనసాగడానికి ఇష్టపడేవారైతే నెక్ట్స్‌ స్టెప్‌ అంటుంటారు పిల్లలిద్దరూ. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగంలో వృద్ధిలోకి రావాలన్నదే నేను కోరుకునేది’’ అని ముగించారు జ్యోతి. 

– నిర్మలారెడ్డి
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు