చెవులు జాగ్రత్త..!

25 Oct, 2021 03:13 IST|Sakshi

‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్‌ కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చూద్దాం. భగవంతుడు మనకు రెండు చెవులు, ఒక నోరు ఇచ్చాడు. నిజానికి మనం అనేక విషయాలను తెలుసుకోవడం చెవుల ద్వారానే సాధ్యం.  

‘భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః..’’ అంటుంది వేదం. అంటే –మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎల్లవేళలా అవి శుభప్రదములైన వాటినే వినుగాక...’’ అని. ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచిమాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ.  ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది.

అందుకే రామాయణంలో ... రావణుడితో మారీచుడు మాట్లాడుతూ... ‘‘సులభాః పురుషా రాజన్‌ సతతం ప్రియవాదినః ’ అప్రియతస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ’’..అంటాడు. లోకంలో మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ..‘‘బాగుంది. మంచిపని చేస్తున్నావు. నీకిష్టమయింది నీవు చేయకపోతే ఎవరు చేస్తారు, నీ సంతోషం కన్నా గొప్పదేముంటుంది !..’’ అంటూ మనల్ని తప్పుత్రోవలో ప్రోత్సహించేవారు చాలా మంది కనబడతారు.

కారణం? ‘‘ఇప్పుడు వీడికి మంచి చెప్పినా వింటాడాం ఏం!’’ అనుకుంటారు. అంతే తప్ప ‘ఇది తప్పు. నీవిలా చేయవద్దు’ అని చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మన అభివృద్ధిని కోరుకునేవారు, మనమంటే ప్రేమాభిమానాలు ఉన్న... తాతలు, తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మేనమామ, మేనత్తలవంటివారు... మన మనసు కష్టపడుతుందని తెలిసినా, మనకు ఏది మంచో ఏ మాటలు ఆచరణలో పెడితే మనం వద్ధిలోకి వస్తామో... అటువంటివి నిర్మొహమాటంగా మనకు చెపుతారు.

సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లకుప్పలోనే కదా! అన్ని రాళ్లు పరిశీలనగా వెతుకుతుంటే సాలగ్రామం దొరుకుతుంది. అలాగే అక్కరలేని మాటలు, మన మనసును ఆకట్టుకోవడానికి మనకు హానికరమని తెలిసి కూడా ప్రీతితో అదే పనిగా పొగుడుతూ మాట్లాడే మాటలు.. అప్పటికి మన మనసుకు ఆహ్లాదం కలిగించినా  వాటిని గుర్తెరిగి మసలుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ‘చేతులకు నూనె రాసుకొని పనస తొనలు తీసేవాడికి దాని పాలజిగురు అంటదు. అంతే. జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అసలు ప్రయత్నం మానకూడదు.. వినాలి ఎవరు ఏది చెప్పినా వినాలి. వాటిలో మనకు ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేవాటిని వదిలేయాలి.

అదే మారీచుడు చెప్పింది... హితం కోరి చెప్పేవాడి మాట మనసుకు కఠినంగా తగిలినా...స్వీకరించాలి. మంచి చెప్పేవాడు దొరకనే దొరకడు. అటువంటివాడు దొరికినా ఓపికగా వినేవాడు దొరకడు. మంచి చెప్పేవాడు, శ్రద్ధగా హితోక్తులు వినేవాడు ఒకేచోట సర్వసాధారణంగా దొరకరు. దొరికితే అది తీర్థం. అది క్షేత్రం. కారణం– ఫలితం వారిద్దరికే కాదు దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం అవుతుంది.

సూక్తి సుధ
► జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
► నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
► ఎప్పుడూ పొందనిది కావాలంటే ఎప్పుడూ చేయని కృషి చేయాలి.
► భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు భయపడేవారు ఏమి సాధించలేరు.
► సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు
.


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు