దానం-ధర్మం

6 Oct, 2023 12:01 IST|Sakshi

ప్రతి మనిషి కష్టపడి తన బతుకును తాను బతకాలి. తనపై ఆధారపడిన వారిని కూడా పోషించాలి. వారి ఆలన పాలన సరిగా చూసుకోవాలి. దీనంతటికీ డబ్బు కావాలి. న్యాయమైన మార్గంలో డబ్బు సంపాదించాలి. అలా సంపాదించిన సొమ్ములో కొంతైనా దానధర్మాలకు వెచ్చించాలి. తర తరాలుగా ఇది పెద్దలు చెబుతూ వస్తున్న మాట. తాను కష్టపడి సంపాదించుకొన్న సొమ్ము అయినప్పటికీ, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి,చేసే పని సఫలం చెంది, సంపాదన తనది కావడం మాత్రం దైవ కృప లేకుండా జరుగదన్నది ఆ మాటల వెనక దాగి ఉన్న పరమార్థం. అందుచేతనే, భాగ్యవశాన సమకూడిన దైవకృపకు కృతజ్ఞతగా, సంపాదించుకున్న సొమ్ములో తన శక్తి మేరకు దానధర్మాలకు వెచ్చించడ మన్నది నియమంగా పెట్టుకొనడం మంచిదని పెద్దలు చెప్పారు. 

అలా కాకుండా సంపాదించినదంతా ‘నా సొంతకష్టంతోనే కాబట్టి, మొత్తాన్ని నేనే అనుభవిస్తాను, నా పొట్ట నేనింపుకుంటాను తప్ప దాన ధర్మాలకు ఖర్చు చేయను’ అని అనుకుంటే, ఆ  అలోచన సరైనది కాదని, అలా ఆలోచించి తదనుగుణంగా నడుచుకునే వ్యక్తి కంటె కాయకష్టం చేసి మనిషికి సహాయపడే మూగజీవాలు మేలైనవనే ఆలోచన కొన్ని శతాబ్దాల క్రితం నుండి ప్రజల మనసులలో ఆమోదం పొంది ఉంది. ఆ ఆలోచననే క్రీ.శ. 15–16 శతాబ్దాలకు చెందిన కవి కొఱవి గోపరాజు తాను రచించిన ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యం, షష్ఠాశ్వాసంలోని ఈ కింది ఆటవెలది పద్యంలో చెప్పాడు.   
దానధర్మములకు బూనక తన పొట్ట 
నినుపుకొన దలంచు జనుడె పశువు 
పసరమైన మెఱుగు బండియీడుచు దున్ను  
నంతకంటె గష్టుడండ్రు బుధులు.

‘దానం, ధర్మం అనే ఆలోచన ఏమాత్రం చేయకుండా, ఎప్పుడూ తన పొట్టను మాత్రమే నింపుకోవాలనే ఆలోచన చేసే వాడ... బండి లాగుతూ వ్యాపారస్థుడికీ, సగటు మనిషికీ, పొలం దున్నుతూ వ్యవసాయదారుడికీ ప్రతి రోజూ సాయపడే గోమహిష జాతిదైన మూగజీవి కంటె తక్కువైన వాడని పెద్దలు చెబుతారు’ అని పై పద్యం భావం.
– భట్టు వెంకటరావు 

మరిన్ని వార్తలు