రెండేమిటి మూడు ఎన్నికలైనా జరపవచ్చు..

30 Sep, 2023 04:04 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకే కాదు, వాటికి స్థానిక సంస్థలను కలిపి మూడింటికీ ఒకేసారి ఎన్నికలు జరుపుకోవచ్చు. తద్వారా, స్థానిక అభివృద్ధి, నియోజక వర్గాల వారీ అభివృద్ది పట్ల ఆయా పార్టీల వైఖరికి ప్రాధాన్యత పెరుగుతుంది. వికేంద్రీకృత అభివృద్ధి, సమాన అభివృద్ధి దృష్టి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయనే మాట రీత్యా, స్థానిక, రాష్ట్ర, కేంద్ర పరిపాలన సమ ప్రాధాన్యత రీత్యా ఆలోచించినపుడు మూడింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలుగుతుంది. ప్రజలు మూడు విధాల పనికి వచ్చే, పని చేసే నాయకత్వాన్ని ఎన్నుకునే అవ కాశం కలుగుతుంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికయ్యాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే వారి ఎన్నికకు అడ్డుకట్ట పడుతుంది.  అయితే ఇటువంటి ఎన్నికల విధానం కోసం కొన్ని పనులు  ముందుగా నిర్వర్తించాలి. అందులో ముఖ్యమైనది రాజ్యాంగ సవరణ. జమిలి ఎన్నికలు ఫెడరలి జానికి విరుద్ధం. రాష్ట్ర ప్రయోజనాలకు, స్వేచ్ఛకు, అధికారాలకు విరుద్ధం. అందరు అంగీకరిస్తేనే  జమిలి ఎన్నికల ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలి. కొత్త ఎన్నికల విధానం ప్రవేశపెట్టడానికి ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలి. ప్రభుత్వాల పదవీకాలం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించి ప్రజల తీర్పు మరోసారి తొందరగా పొందడానికి, అవకాశం కల్పించాలి.

200 ఏళ్ల క్రితం నిర్ణయించుకుని  4 ఏళ్లకోసారి అమెరికా ఎన్నికలు జరుపుకొంటున్నది. మనం మూడేళ్లకొకసారి ఎన్నికలు జరుపుకొంటూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆదర్శంగా నిలవాలి. రెండవసారి గెలి స్తేనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్లుంటాయనే నిబంధన పెట్టాలి. ఇలాగైతేనే మొదటిసారి ఎన్నికైనపుడు ప్రజలకు ప్రజా ప్రతి నిధులు తమ సేవలతో అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యానికి కట్టుబడి పార్టీలో అన్ని స్థాయుల్లో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసు కోవాలి. ఆయా దేశాల జనాభాను బట్టి చట్ట సభల్లో సీట్ల సంఖ్య నిర్ణయమవుతోంది.

ఆ మేర ప్రజా ప్రతినిధులు ఎన్నికవు తున్నారు. కానీ మనదేశంలో జనాభా పరంగా చూసినప్పుడు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు తక్కువనే చెప్పాలి. జనాభా పరంగా చూసినప్పుడు భారత్‌లో 3,200 మంది పార్లమెంటు సభ్యులు (2,600 లోక్‌సభ సభ్యులు, 600 రాజ్యసభ సభ్యులు) ఉండాలి.  చైనా, అమెరికా, గ్రేట్‌ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రే లియా, జపాన్‌ చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్యతో పోల్చినప్పుడు... మన చట్ట సభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్య పెంచవలసిన అవసరం బోధపడుతుంది. భారతదేశ జనాభా ప్రకారం సభ్యుల సీట్లే కాదు, ఇప్పటి అసెంబ్లీల సీట్లకు నాలుగైదు రెట్లు పెరగాలి.

ఇదేవిధంగా స్థానిక సంస్థల సీట్లూ పెంచాలి. 3,200 పార్లమెంట్‌ సీట్లలో మహిళలకు సగం, బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. వీలైతే అందరి సమ్మతితో ఆధార్‌  కార్డుతో ఓటర్‌ కార్డు, పాన్‌ కార్డు, వృత్తి, మొత్తం ఆస్తిపాస్తుల రికార్డు అనుసంధానించాలి. ఏ నియోజక వర్గంలో ఓటు వేశారో  తెలిపే ఒక ‘కాలమ్‌’ చేర్చు కోవడం ద్వారా రెండు మూడు చోట్ల ఓటర్ల లిస్టులో పేరుంటే ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేసే విధంగా ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకోవాలి. అపుడే కరెక్టుగా అన్ని ప్రాంతా లకూ, వర్గాలకూ ప్రాతినిధ్యం లభిస్తుంది.

మరీ ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కును చేర్చాలి. అలాగే పౌర బాధ్యతల్లో ఎన్నికల్లో ఓటుహక్కును విని యోగించుకోవడాన్నీ చేర్చాలి. సంక్షేమ పథకాలు, ప్రణాళికలు నియోజక వర్గాలవారీగా రూపొందించుకోవడం అవసరం. బ్యాంకింగ్, సైనిక, రైల్వే వంటి రంగాలకు నియోజక వర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నపుడే అన్ని రంగాలవారి ప్రాతినిధ్యంతో సమంగా ప్రజాస్వామ్యం అందుబాటులోకి వస్తుంది. ఆదాయ పన్ను ఇతర దేశాలలో వలె రాష్ట్రాలకే చెందడం అవసరం. ఈ విధానం అనుసరిస్తే లోక్‌సభ నియోజక వర్గం నుండి ఏటా ఇద్దరు చొప్పున పదేళ్లలో 20 మంది ఐఏఎస్‌లూ, ఐపీఎస్‌లూ ఎన్నికవుతారు. వారు ఎక్కడున్నా తమ ప్రాంత అభి వృద్ధిని పట్టించుకుంటారు. అలాగే జడ్జీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సైనికులు అన్ని నియోజక వర్గాల నుండి సమంగా ఎదుగుతారు.

గ్రామ సభల వలె నాలుగు నెలలకోసారి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సభలు ఏర్పాటు చేసి, నిర్వహించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్‌ సమా వేశాలకు ముందు ఈ సభలు నిర్వహించి స్థానిక అభివృద్ధి, సంక్షేమం, ప్రణాళికలపై చర్చించాలి. ఎంపీ లాడ్స్‌ ఫండ్స్‌ దేనికి ఖర్చు చేయాలో ఈ సభల్లో చర్చించి అనుమతి పొందాలి. అప్పుడే ఎక్కడ నిధుల కొరత ఉందో అక్కడికి నిధులను మళ్లించవచ్చు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత జమిలి ఎన్నికలే కాదు, మూడు ఎన్నికలు ఒకేసారి జరుపుకోవచ్చు.

బి. ఎస్‌. రాములు
వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్, సామాజికవేత్త

మరిన్ని వార్తలు