వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!

28 Mar, 2024 10:20 IST|Sakshi
దోసకాయలు తెంపుతున్న రైతులు

దోసకాయలకు C/O కనకాపూర్‌

వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు.

కరీంనగర్‌, నిర్మల్‌ మండలంలోని కనకాపూర్‌ గ్రామం దోసకాయలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు.

తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం
ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్‌ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్‌లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు.

– రాజు, యువ రైతు, కనకాపూర్‌

సేంద్రియ ఎరువులతో సాగు
దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.

మంచి ఆదాయం..
ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. 

– రఘు, యువ రైతు, కనకాపూర్

ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది

Election 2024

మరిన్ని వార్తలు