IPL 2024 SRH VS MI: క్లాసెన్‌ 'కోత'.. ఐపీఎల్‌లో కొనసాగుతున్న సఫారీ బ్యాటర్‌ విధ్వంసం

28 Mar, 2024 10:16 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ ఊచకోత కొనసాగుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జతకట్టినప్పటి నుంచి క్లాసెన్‌ విధ్వంసం తారాస్థాయికి చేరింది. సన్‌రైజర్స్‌ తరఫున ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లు ఆడిన క్లాసెన్‌.. సెంచరీ (ఆర్సీబీపై 51 బంతుల్లో 104), నాలుగు హాఫ్‌ సెంచరీల సాయంతో 560 పరుగులు చేశాడు. ఈ పరుగులను క్లాసెన్‌ కేవలం 316 బంతుల్లోనే సాధించడం​ విశేషం.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై 29 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో 63 పరుగుల చేసిన క్లాసెన్‌.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 80 పరుగులు చేసి లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్దసెంచరీలు బాదిన క్లాసెన్‌.. 226.98 స్ట్రయిక్‌రేట్‌తో 143 సగటున 4 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 143 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 

ఐపీఎల్‌ 2024కు ముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ క్లాసెన్‌ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించే క్లాసెన్‌.. గడిచిన సీజన్‌లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 207.91 స్ట్రయిక్‌రేట్‌తో 40.64 సగటున 25 ఫోర్లు, 37 సిక్సర్ల సాయంతో 447 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్దసెంచరీలు ఉన్నాయి. 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున క్లాసెన్‌ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి..
16*(6), 36(16), 17(16), 31(19), 53*(27), 36(20), 26(12), 47(29), 64(44), 104(51), 18(13), 63(29), తాజాగా ముంబై ఇండియన్స్‌పై 34 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 నాటౌట్‌) విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాటం చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. 
 

Election 2024

మరిన్ని వార్తలు