భయం నుండి విడుదల 

13 Feb, 2023 00:42 IST|Sakshi

కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును (సామె 1:33). మానవుని పట్టి పీడుస్తున్న అనేక భయాల్లో ఒకటి ‘భవిష్యత్తును గూర్చిన భయం’. తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, గత జీవితాన్ని గురించి భయపడేది కేవలం పది శాతమైతే మిగతా తొంభైశాతం భయం భవిష్యత్తులో ఏం జరగబోతుంది... అనే దానిపై ఆధారపడి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల వివరణ. భవిష్యత్తును గూర్చి తెలీదు గనుక దాని గురించి భయపడడం సహజం. అయితే కొందరు ప్రతి చిన్నదానికి భయపడి తమ చుట్టూ ఉన్నవారిని భయపెడుతుంటారు. దినదినం మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడన్నది వాస్తవ దూరం కాదు. భయంతో మనిషి తన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందమయం చేసుకోలేకపోతున్నాడు.

భయం మనిషిలో ఉన్న స్వాభావిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయం వలన మానవుడు తాను చేయాలనుకున్న పనులు చేయలేడు. అనేక మంచికార్యాలను నిలువరించే శక్తి భయానికి మాత్రమే ఉంది. భవిష్యత్తు చాలా అందమైనది. సర్వశక్తుడైన క్రీస్తులో అది సురక్షితమైనది. భవిష్యత్తు మీద ఉన్న ఆశలను నిర్వీర్యం చేసేది నీలో ఉన్న భయమే. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని నిర్దిష్ట పరిధుల్లో భయం ఉండడం సహజమే కానీ కొంతమంది భయకారణం లేని చోట కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. 

ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టుట. రాత్రివేళ తమ మందను కాచుకొంటున్న గొర్రెల కాపరులకు ఇయ్యబడిన వాగ్దానం భయపడకుడి. వారికున్న భయం బహుశా ఇంకెంత కాలం ఈ గొర్రెలను మేపుతూ ఉండాలి? వాటిని ప్రజల పా పపరిహారార్థమై దేవాలయానికి తరలించాలి? దూత చెప్పిన వర్తమానం వారి కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన సర్వలోక పా పా న్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యమైన బైబిల్‌లో అనేకచోట్ల భయపడకుడి అనే వాగ్దానం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి గుండెల్లో గూడు కట్టుకుపోయిన భయాన్ని రూపుమాపడానికే దేవుడు ఈ లోకానికి అరుదెంచాడు. ఆయన ధైర్యవంతుడు గనుకనే ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఉచితంగా మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. 

యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ‘దేవుడు నాకు వెలుగును రక్షణయునై యున్నాడు నేను ఎవరికి భయపడుదును’ అని దావీదు వలే నువ్వు కూడా చెప్పగలవు (కీర్తన 27:1). శత్రువులతో తరుమబడినప్పుడు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో దేవునియందు విశ్వాసముంచి తనలో ఉన్న ప్రతి భయాన్ని జయించిన దావీదు ధన్యజీవిగా మారాడు. నీవు దేవునియందు నమ్మికయుంచి ధైర్యంతో ముందుకు సాగిపో మిత్రమా!

– డా. జాన్‌ వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు