ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?

4 Dec, 2023 11:06 IST|Sakshi

నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్‌ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా?
– మాదిరాజు శ్యామల, కొల్లాపూర్‌

మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్‌ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్‌ మ్యారెజెస్‌ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్‌ యాసిడ్‌ 5ఎమ్‌జీ మాత్రలు, బి– కాంప్లెక్స్‌ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్‌ ప్రాబ్లమ్స్‌ తక్కువుంటాయి.

మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్‌ కౌన్సెలర్స్‌ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయిన తరువాత హైరిస్క్‌ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్‌ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌తో స్కాన్స్‌ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్‌ అబ్‌నార్మలిటీస్‌ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్‌ సిండ్రోమ్‌ స్క్రీనింగ్‌ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్‌ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టవచ్చు.

ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్‌గా వస్తే అడ్వాన్స్‌డ్‌ టెస్ట్స్‌ లాంటివి హైరిస్క్‌ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి రొటీన్‌ చెకప్‌ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్‌చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్‌ కౌన్సెలింగ్‌కి వెళితే మంచిది. ప్రాపర్‌ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు.

-డా.భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

>
మరిన్ని వార్తలు