‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ

28 Mar, 2024 11:57 IST|Sakshi

పుస్తక సమీక్ష:
“Dr. Ambedkar’s Ideology in the Digital Era”
(రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా  (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం)

ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. 

డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను  టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు.  ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో  భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు  27శాతం  మాత్రమే ఓటింగ్‌ రావడం,  చివరికి  వల్లభాయి పటేల్‌ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ,  పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. 

అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. 

ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. 

ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు.

డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. 

డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. 

సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. 

ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు.

ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి.

డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం.  

డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. 

నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత.  సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత,  డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. 

ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. 

అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. 

డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం.  ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది.

శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. 

ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. 

​‍- విజయభాను కోటే
ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్‌పర్ట్‌
8247769052 

(పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My)

Election 2024

మరిన్ని వార్తలు