భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని? | Sakshi
Sakshi News home page

భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?

Published Mon, Mar 25 2024 5:42 AM

Ts Gurukula: Appointment orders for 7 thousand people - Sakshi

గురుకుల కొలువుల భర్తీపై ఇప్పట్లో స్పష్టత కష్టమే

ఇప్పటివరకు 7 వేల మందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చాలా మందికి నిలుపుదల

అభ్యర్థులకు పోస్టింగ్, ఆ తర్వాత జాయినింగ్‌ తర్వాతే ఖాళీలపై స్పష్టత

అప్పటివరకు వేచి చూడాల్సిందే అంటున్న బోర్డు అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకోలేదు.

ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ కూడా వెలువడటం.. దానికితోడు జూన్‌ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు.

9,231 కొలువులకు నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్‌ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్‌ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్‌ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. 

ఎన్నికల కోడ్‌ ముగిశాకే..
అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్‌ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. 

Advertisement
Advertisement