మనసుకి వ్యాయామం

11 Sep, 2023 00:23 IST|Sakshi

మంచిమాట

శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు.

శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే!

దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు.

ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని  చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి.

మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది.

అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు.  ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు.

ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్‌ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్‌ జాగ్రత!!  

డా‘‘ ఎన్‌ అనంత లక్ష్మి

మరిన్ని వార్తలు