Annaatthe Mathew Story: అన్నేత్తే మాథ్యూ.. ఎవరీమె? వేల మంది సబ్‌స్క్రైబర్లు ఎందుకు?

26 Feb, 2022 14:55 IST|Sakshi

ఊరికి పోదామా! మొక్కలకు నీళ్లెలా?

వేసవి వస్తోంది. పరీక్షలు పూర్తయ్యేలోపు ఈ హాలిడేస్‌కి ఎక్కడికి వెళ్దాం? అనే ప్లాన్‌ మొదలవుతుంటుంది. అసలే రెండేళ్లుగా ఇంట్లోనే గడిచిపోయిన జీవితాలు ఇప్పుడు రెక్కలు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టూర్‌ ప్లాన్‌ వేయడం సులభమే, కానీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కల సంరక్షణ ఎలా? మొక్కల ప్రేమికుల మనసును కలచి వేసే ఆవేదన ఇది.

ఇందుకోసం ‘గ్రీక్స్‌ ఆఫ్‌ గ్రీన్‌’  యూ ట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తున్న అన్నేత్తే మాథ్యూ సూచనలను అనుసరిద్దాం. ఇంతకీ అన్నేత్తే మాథ్యూ ఎవరు? ఆ వివరాలూ తెలుసుకుందాం. ఊరెళ్లే రోజు మొక్కలన్నింటికీ సమృద్ధిగా నీరు పోయాలి. కుండీలకు నేరుగా ఎండ తగిలితే మట్టి త్వరగా ఎండిపోతుంది. కాబట్టి కుండీలను నీడలో ఉంచాలి.

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో నీటిని నింపి మూతకు సన్నని సూదితో రెండు రంధ్రాలు చేసి బాటిల్‌ని తిరగేసి చెట్టు మొదట్లో అమర్చాలి. లలా చేయడం వల్ల మొక్క పాదుకు కొద్ది కొద్దిగా నీరు అందుతూ ఉంటుంది. ఇంట్లో వెడల్పు తొట్టె ఉంటే ఆ తొట్టెలో నీటిని నింపి ఆ నీటిలో మొక్కల కుండీలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుండీల్లో ఉన్న తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది. పెద్ద తొట్టె లేనప్పుడు కుండీలను ఉంచగలిగిన సైజ్‌ ప్లాస్టిక్‌ టబ్‌లు తెచ్చి అందులో నీటిని నింపి మొక్కల కుండీలను ఉంచవచ్చు.

నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎదురవుతుంది. ఈ సమస్యను నివారించడానికి టబ్‌లోని నీటిలో మూడు చుక్కల హైడ్రోజెన్‌ పెరాక్సైడ్, మూడు చుక్కల డిష్‌ వాష్‌ లిక్విడ్‌ వేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే మరో సులువైన చిట్కా ఉంది.

ఒక పాత్రలో నీటిని పోసి నూలు వస్త్రాన్ని తాడులా చేసి ఒక చివరను నీటి పాత్రలో, మరొక చివరను మొక్క మొదట్లో ఉండేటట్లు అమర్చాలి. నీటి పాత్ర నుంచి మొక్క పాదులోకి నూలు వస్త్రం తాడు సాయంతో తేమ అందుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకే పాత్రలో ఎక్కువ నూలు తాళ్లను ఉంచి రెండో చివర్లను ఒక్కో పాదులో అమర్చడం ద్వారా ఎక్కువ మొక్కలకు నీటిని సరఫరా చేయవచ్చు.         

ఎనిమిదేళ్ల శ్రమకు దర్పణం
మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో మూడు వందల రకాల మొక్కలను పెంచుతోంది. ‘‘ముస్సోరీలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి మొక్కలను చూస్తే ముచ్చటేసింది. వచ్చేటప్పుడు నాతోపాటు నలభై మొలకలను వెంట తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మొక్కలే లోకం గా మారిపోయింది. మొక్కలు చిగుళ్లు తొడగడం నుంచి మొగ్గ తొడగడం పువ్వు పూయడం ప్రతిదీ స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డు చేసేదాన్ని.

ఈ మొక్క ఫలానా, ఈ పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది... వంటి వివరాలన్నీ ఎవరో ఒకరితో చెప్పాలనిపించేది. దాంతో నాలుగేళ్ల కిందట యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి నా మొక్కల వీడియోలను అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టాను. దాదాపుగా ఎనిమిది నెలల వరకు నా చానెల్‌ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వ్యూయర్‌షిప్‌ చాలా వేగంగా పెరిగిపోయింది.

మొక్కల పెంపకంలో నేను అనుసరిస్తున్న మెళకువలు, పరిరక్షణ పద్ధతులను కూడా వీక్షకులతో పంచుకుంటూ ఉండడంతో, అవన్నీ వారికి ఉపయుక్తంగా ఉంటున్నాయని మా వీక్షకుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. చాలా మంది మొక్కలను పెంచడం ఇష్టంగానే ఉంటోంది కానీ, ఓ వారం రోజులపాటు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోంది.

తిరిగి వచ్చేటప్పటికి వాడిపోతాయనే భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాం అంటుంటారు. వాళ్ల కోసం ఈ చిట్కాలు’’ అంటారు అన్నేత్తే మాథ్యూ. ఆమె చానెల్‌కి ఎనభై వేల మంది సబ్‌స్క్రైబర్‌లున్నారు. ఎనిమిదేళ్లపాటు మొక్కలే లోకంగా జీవించిన మాథ్యూ సాధించిన పచ్చటి ప్రగతి ఇది. 

మరిన్ని వార్తలు