Gagandeep Kang: వాక్సినాలజిస్ట్‌ చల్లనమ్మ

8 May, 2021 14:04 IST|Sakshi
గగన్‌దీప్‌ కాంగ్, వ్యాక్సినాలజిస్ట్‌

థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది! కరోనా వ్యాప్తి ఈ నెల మధ్యలో తగ్గడం ప్రారంభించి, నెలాఖరుకు క్షీణ దశకు చేరుకుంటుందని గగన్‌దీప్‌ కాంగ్‌ అనే వ్యాక్సినాలజిస్ట్‌ గురువారం ఓ వెబినార్‌లో చెప్పారు! ఊరికే ధైర్యం చెప్పడం కోసం ఆమె ఆ మాట అనలేదు. నిరుడు మార్చి నెలలో దేశంలో కరోనా కేసులు అరవైకి చేరి, ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు చేరువవుతున్న దశలో సైతం గగన్‌దీప్‌ మరీ బెంబేలెత్తి పోనవసరం లేదని భరోసా ఇవ్వడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అలెర్ట్‌ చేశారు మంచి మాటల చల్లనమ్మ గగన్‌ దీప్‌ కాంగ్‌!

గగనదీప్‌ వైరాలజిస్ట్‌. వైరస్‌ల మీద పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో ‘గ్యాస్ట్రోఇంటెస్టెనల్‌ సైన్సెస్‌’ విభాగం ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. బ్రిటన్‌లోని ‘రాయల్‌ సొసైటీ’ ఫెలోషిప్‌ను పొందిన తొలి భారతీయ మహిళ గగన్‌దీప్‌. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం ఐదేళ్ల చిన్నారులకు సోకే రోటా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టిన శాస్త్రవేత్తగానే! రోటా వైరస్‌ వల్ల వచ్చే డయారియాతో ఏటా లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవారు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్టవేశారు గగన్‌దీప్‌. ఏడాదిన్నరగా ఆమె కరోనా వైరస్‌ స్వభావాన్ని పరిశోధిస్తున్నారు. ఆ ఫలితాల గురించి ఉమెన్‌ ప్రెస్‌ కోర్స్‌ వెబినార్‌లో చెబుతున్నప్పుడే.. ‘‘ఇప్పుడు మేము పరిశీలిస్తున్న కరోనా వైరస్‌ గుణాలను బట్టి మే నెల మధ్య నుంచీ వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని గగన్‌దీప్‌ చెప్పారు.
∙∙
ఏ విషయాన్నైనా ‘భయం లేదు’ అన్నట్లే ప్రకటిస్తారు గగన్‌దీప్‌. అదే సమయంలో ‘నిర్లక్ష్యంగా ఉండేందుకూ లేదు’ అని భుజం తట్టినట్లు చెబుతారు. ‘‘శాస్త్రవేత్తలుగా మా దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ దగ్గర జాగ్రత్తలు ఉండాలి’’ అంటారు. ఇప్పుడీ కరోనా పరిస్థితులకు చక్కగా సరిపోయే మాటే. భయం అక్కర్లేదు. కానీ అతి ధైర్యమూ పనికి రాదు. ఇక ఆమె చెప్పే ఏ మాటైనా మనం నిశ్చింతగా ఎందుకు నమ్మేయాలంటే.. తను వైరాలజిస్ట్, వాక్సినాలజిస్టు కూడా కాబట్టి.

గగన్‌దీప్‌కు చిన్నప్పట్నుంచీ.. రూఢీ కానిదేదీ నమ్మదగినది కాదనే నమ్మకం ఉంది. ఆమె తండ్రి రైల్వేస్‌లో మెకానికల్‌ ఇంజనీరు. తల్లి ఇంగ్లిష్, మేథ్స్‌ సబ్జెక్టుల టీచర్‌. íసిమ్లాలో పుట్టారు గగన్‌దీప్‌. తండ్రి ఉద్యోగంలో ఉండే బదిలీల వల్ల పదో తరగతికి వచ్చేలోగా పది స్కూళ్లు మారారు. దేశమంతటా తిరిగి చదివినట్లు లెక్క. బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశాలు. తండ్రి చేత ఇంట్లోనే ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేయించుకుని పరిశీలనలు, ప్రయోగాలు చేస్తుండేవారు. ఆ ఆసక్తే ఆమె చేత మెడిసిన్‌ చదివించింది. మైక్రో బయాలజీలో పీహెచ్‌డీ చేయించింది. ఇక పలు రకాలైన వైరస్‌లు, బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆమె చేసిన పరిశోధనలు, వాక్సిన్‌లు కనిపెట్టేందుకు చేసిన కృషి ఆమెకు 2019లో రాయల్‌ సొసైటీ గౌరవాన్ని సాధించిపెట్టాయి.

గగన్‌దీప్‌ ప్రస్తుతం వెల్లూరులో ప్రొఫెసర్‌గా ఉంటూనే కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు