-

Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన

28 Nov, 2023 00:34 IST|Sakshi
ఆదివారం నాడు కాలిఫోర్నియాలో కూచిపూడి నాట్యప్రదర్శన సందర్భంగా జ్యోతి ప్రజ్వలన, చిన్నారుల నాట్య ప్రదర్శన

కూచిపూడి

‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు.

కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కళామతల్లి దక్షిణ
‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ.

నాట్యానికి డిజిటల్‌ వేదిక
కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్‌ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్‌ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు.

మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కూచిపూడి డాన్స్‌’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు.

అమ్మ దిద్దిన వ్యక్తిత్వం
నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్‌ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం.

నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్‌ నిల్సన్‌ది స్వీడన్‌. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్‌. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు