కామాఖ్య ఆలయం.. విహార విశేషాలు!

30 Oct, 2021 12:00 IST|Sakshi

శుభ కామన దీపం
అస్సాం రాష్ట్రం, గువాహటి. నీలాచల పర్వత శ్రేణులతో అందమైన ప్రదేశం. ఇక్కడే ఉంది కామాఖ్య ఆలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పురాణకాలంలో నరకాసురుడు నిర్మించాడని చెబుతారు. పదహారవ శతాబ్దం నాటి పాలకులు ధ్వంసం చేయడంతో పదిహేడవ శతాబ్దంలో స్థానిక కూచ్‌బేహార్‌ పాలకుడు మహారాజా బిశ్వసింగ్‌ పునర్నిర్మించాడు. కామరూప రాజ్యానికి ప్రతీక దేవత కాబట్టి కామాఖ్య అనే పేరు వచ్చినట్లు మరో కథనం. ప్రధాన ఆలయానికి సమీపంలో సౌభాగ్య కుండం ఉంది. దీనిని దేవతల రాజు దేవేంద్రుడు తవ్వించాడని నమ్మకం. మరో ప్రధాన కుండం పేరు భైరవ్‌ కుండం. ఇందులో మనం ఊహించనంత పెద్ద సైజు తాబేళ్లుంటాయి. 

కటి బిహు పంటల వేడుక కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీపాలు వెలిగించడమే ప్రధానం. తులసి చెట్టు దగ్గర మొదలు పెట్టి  ఇంటి ఆవరణ అంతా దీపాలతో వెలుగులు నింపుతారు. ఇంటింటా వెలిగే దీపాలతోపాటు ఊరంతా సామూహికంగా వెలిగించే దీపాన్ని ఆకాశబంటి అంటారు. దీపం వెలిగిస్తూ ఏ కోరిక కోరితే అది తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. 

బ్రహ్మపుత్రలో విహారం
మూడు రోజుల కామాఖ్య టూర్‌ ప్యాకేజ్‌లో గువాహటి విమానాశ్రయంలో టూర్‌ ఆపరేటర్‌లు పికప్‌ చేసుకుంటారు. హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయిన తరవాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలో సన్‌సెట్‌ క్రూయిజ్‌ విహారం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవి దర్శనం, ఆ తర్వాత బాగలా ఆలయం, భువనేశ్వరి, ఉమానంద, నబగ్రహ, ఉగ్రతార, సుక్లేశ్వర్, బాలాజీ ఆలయాలు, భీమశంకర్‌ జ్యోతిర్లింగ క్షేత్రం, వశిష్ట ఆలయం, హస్తకళల ఎంపోరియమ్‌ సందర్శనం ఉంటాయి. మూడవ రోజు గువాహటి ఎయిర్‌పోర్టులో డ్రాప్‌ చేయడంతో టూర్‌ ప్యాకేజ్‌ పూర్తవుతుంది. ఈ సీజన్‌లో క్రూయిజ్‌ ప్యాకేజ్‌లో కటి బిహు వేడుకలను కూడా చూసే అవకాశం ఉంటుంది.

కన్నడ తీరాన రాయల విడిది
మడకశిరలో సత్యభామ సంతాన వేణుగోపాల స్వామితోపాటు దర్శనమిస్తుంది. అదే విగ్రహంలో రుక్మిణి కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కర్నాటక – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన రాయలు ఇక్కడ ఆలయాన్ని కట్టించి, తన విహారకేంద్రంగానూ, విడిది కేంద్రంగానూ మలుచుకున్నాడు. 

ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు వృద్ధాశ్రమం నిర్మించి అభాగ్యులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించడమైంది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే... తులసీమాత ఆలయం. దేశంలో మరెక్కడా తులసీమాతకు ఆలయం లేదని ఇది మాత్రమే ఏకైక ఆలయం అని ఇస్కాన్‌ ధృవీకరించింది. దీపావళి పండుగతోపాటు దీపావళి తర్వాత పన్నెండు రోజులకు వచ్చే చిలకద్వాదశి కూడా వేడుకగా నిర్వహిస్తారు.

ట్రావెల్‌ టిప్స్‌
►మీరు వెళ్తున్న ప్రదేశంలో కరోనా కేసుల తీవ్రతలేదని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశంలో కూడా కరోనా తీవ్రత లేకపోతేనే ఇతర ప్రదేశాలకు వెళ్లాలి.
►మీ బస శానిటైజ్‌ అయినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. అవసరమైతే మరోసారి శానిటైజ్‌ చేయవలసిందిగా కోరాలి.
►మీరు కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు ఇంకా వేసుకోనట్లయితే పర్యటన ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది.
►పర్యాటక ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రతతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
►మీ ఇంట్లో కోవిడ్‌ హైరిస్క్‌ పీపుల్‌ ఉంటే మీ పర్యటన ఆలోచన మానుకోవడమే మంచిది. 

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

మరిన్ని వార్తలు