Sheetal Mahajan: ఎవరెస్ట్‌ జంప్‌

16 Nov, 2023 00:56 IST|Sakshi

వరల్డ్‌ రికార్డ్‌

41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్‌ శీతల్‌ మహాజన్‌ ఎవరెస్ట్‌ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్‌లో ఎవరెస్ట్‌ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే
జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్‌ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం.

‘స్కై డైవింగ్‌ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది.

41 ఏళ్ల శీతల్‌ మహాజన్‌ ఎవరెస్ట్‌ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్‌లో నుంచి జంప్‌ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్‌ అనే చోట సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది.

గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్‌ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్‌ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్‌ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్‌ పౌల్‌ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్‌ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు.

స్త్రీలు ఎందుకు చేయలేరు?
శీతల్‌ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్‌ మహాజన్‌ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్‌ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్‌ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్‌.
ఆ తర్వాత ఆమె గూగుల్‌ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్‌. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్‌ థామస్‌ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్‌ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్‌.

15 లక్షల ఖర్చుతో
2004లో శీతల్‌ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్‌ నార్త్‌ పోల్‌లో స్కై డైవింగ్‌ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్‌ చేశాయి’ అంటుంది శీతల్‌. అప్పటివరకూ శీతల్‌ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్‌ జంప్‌ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్‌ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్‌స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు.

‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్‌ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్‌. 2004 ఏప్రిల్‌ 18న నార్త్‌పోల్‌లో మైనస్‌ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్‌ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది.

ఎన్నో రికార్డులు
ఆ తర్వాతి నుంచి శీతల్‌ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్‌ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం ఎదుట స్కై డైవింగ్‌ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్‌ దగ్గర కూడా జంప్‌ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన వైభవ్‌ రాణెను హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్‌ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు.

నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి  స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్‌ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్‌ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్‌ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి.
 

మరిన్ని వార్తలు