Chaganti Koteswara Rao: కళ్ల ఎదుటే కైలాసం

5 May, 2021 06:42 IST|Sakshi

ఒక హరిప్రసాద్‌ చౌరాసియా, ఒక బిస్మిల్లా ఖాన్‌... మహానుభావులు ఎంతమంది ఎన్నిరకాల వాద్యాలతో, తమ తమ గాత్రాలతో భారత దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచమంతటా ఎగరేశారు. మహాతల్లి, ప్రాతఃస్మరణీయురాలు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి మహాస్వామివారు రాసిన కీర్తనను ఐక్యరాజ్యసమితిలో పాడితే సభ్యులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ఇప్పటీకీ ఆమె పాట వినబడితే అలా నిశ్చేష్టులై నిలబడి పోతాం. సంగీతాన్ని ఉపాసన చేసిన మహానుభావులు నేదునూరి కృష్ణమూర్తి, బాల మురళీకృష్ణ, పినాకపాణి.. ఎంతమంది ఈ దేశ వైభవాన్ని చాటినవారు. భారతీయ సాంస్కృతిక వైభవం.. అంటే ఒక్కొక్క కళతో ఈశ్వరుడిని ఆరాధించి, ఈశ్వరుడిని పొంది, ఈశ్వరుడిని మన అందరికి కూడా అందించి ఈశ్వరునిలో లయమయ్యారు.

నృత్యాన్నే తీసుకోండి. భారతీయ నృత్యం రాజోపచారాల్లోకి చేరింది. నృత్యమంటే ఏదో అర్థంపర్థం లేని పాదాల కదలిక కాదు. ఆంగికం, లాస్యం అని రెండు ఉంటాయి. ఆంగికం అంటే శరీరావయవాలు కదలడం. లాస్యమంటే ముఖంలో భావాలను ప్రకటించడం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు! కేళీవిలాసంలో. అంటే... ప్రపంచమంతా కూడా లాస్య తాండవ సమన్వయంగా ఉంటుంది. ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు ముఖం లో ఒక్కొక్క భావన వస్తుంది. చూసేవారుకూడా సంతోషంతో ఆ భావనను ప్రకటిస్తుంటారు. అప్పుడది లాస్యం. అమ్మవారి రూపం. లాస్యప్రియ, లయకరి.. అని లలితా సహస్రంలో స్తుతిస్తాం.

తాండవం శివస్వరూపం. తాండవం, లాస్యం రెండూ నాలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడున్నట్లే.. అంటే ఇదే కైలాసం. అది మరెక్కడో ఉండదు. మన కళ్ళెదుటే ఉంటుంది. అటువంటి అద్భుత నృత్యం మనదేశంలో పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం. దీనిని రాజోపచారంగా ఎందుకు తీసుకు వస్తారంటే... తిరగడానికి అలవాటుపడిన మనసును పూజలో నిగ్రహించి ఒక్కో ఉపచారం చేస్తున్నప్పుడు దానిని అక్కడ నిలపాలి. యజ్ఞోపవీతం సమర్పయామి.. అన్నప్పుడు ఏదో నోటితో అని వదిలేయడం కాదు.. ఎదురుగా రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయాలి అంటే ఆయన ఉత్తరీయం అడ్డొస్తున్నది. దానిని తొలగించినప్పుడు స్వామి వారి విశాల వక్షస్థలం, ఆయన బాహువులు చూసి... మనసులో దర్శనం చేస్తూ తన్మయత్వంతో పొంగిపోతాం.

ఏకాగ్రతతో అలా పూజచేస్తున్నప్పుడు అలా నిలబడిన మనసు కొంతసేపటికి డస్సిపోతుంది. దానికి మధ్యలో విరామం కావాలి. ఇప్పుడు బ్రేక్‌ అంటున్నారు కదూ... అది ఇప్పటిది కాదు. మనవాళ్ళు ఎప్పుడో నేర్పినటువంటిది. పూజలో కొనసాగుతూండాలి, మనసుకు కొద్దిగా విరామం ఇస్తూండాలి, భగవంతుడిని మాత్రం వదలకుండా కాసేపు రంజకత్వం పొందడానికి ఇచ్చిన అవకాశమే రాజోపచారంలో.. నృత్యం దర్శయామి అనడం.  

అప్పుడు నృత్యం చేయడానికి ఒకావిడ వస్తుంది... కస్తూరీ తిలకం ... అంటూ అక్కడ నెమలీకను చూపిస్తారు. ఇక్కడ నృత్యం చేస్తున్నామె కనపడడం లేదు. కృష్ణుడు కనిపిస్తున్నాడు.. ఆయనని చూస్తూ మనసు సంతోషాన్ని పొందుతుంది. కానీ భగవద్దర్శనాన్ని మాత్రం వదిలిపెట్టదు. అందుకని రాజోపయోగంలోకి తీసుకున్నారు. అదీ భారతీయ నృత్య ప్రయోజనం.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు