పందెం పండాలి

11 Jan, 2021 23:42 IST|Sakshi

నిరుడు... ఎక్కడలేని శూన్యాన్ని నింపింది...కరోనా తన పాజిటివ్‌నెస్‌తో నెగటివిటీని వ్యాపింపజేసింది. నమ్మకం కూడా చిన్నబోయేంత నిస్పృహను అనుభవంలోకి తెచ్చింది.ఈ స్తబ్దతకు చలన చక్రాలు కట్టే మాట వినిపించినా... కాలాన్ని మోసే ఆశ కనిపించినా.. భవిష్యత్తును వెంటేసుకు తిరుగుతుందని నమ్మకం. 2020 చివర్లో వచ్చిన రెండు సినిమాల గురించి ఈ ఉపోద్ఘాతం. ఒకటి: తమిళ చిత్రం ‘పావ కధైగళ్‌’, రెండు: హిందీ మూవీ ‘లూడో’. నిజానికి ఈ రెండిటిలో ‘లూడో’ ముందు విడుదలైంది ఓటీటీలో. ‘పావ కధైగళ్‌’ తర్వాత వచ్చింది. వాస్తవం చేదుగా ఉంటుంది. తీపి పూతతో చెప్తాం. సమయం, సందర్భం చూస్తాం.

మన దేశాన్ని కులం, మతం, పరువు, మర్యాదలే నడిపిస్తున్నాయి. ఇది కఠోర సత్యం. ఈ నాలుగింటినే విలువలుగా మార్చుకుంది మన సమాజం. ఇవి స్నేహాలు, బంధాలు, అనుబంధాలను చూడవు. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలను కూడా కడతేర్చేంత కఠినంగా మార్చేస్తున్నాయి మనుషులను. అందుకే సెక్సువాలిటీ నుంచి పెళ్లి, లైంగికదాడుల వరకు అన్నిటికీ ఈ నాలుగే నేపథ్యం. సమస్యకు పరిష్కారం చూపకుండా పరువు ముసుగులో దాచేస్తుంది. కులంతో దూషిస్తుంది. మతంతో చంపేస్తుంది. దీన్నే చర్చిస్తుంది ‘పావ కధైగళ్‌’, అంటే– ‘పాపిష్టి కథలు’. మనుషులను మనుషులుగా చూడలేని కథలు. జెండర్, కులం, పరువు ఫ్రేమ్‌లోంచి మానవ సంబంధాలను కలుపుకొనే కథలు. నాలుగు భిన్నమైన కథాంశాల సమాహారం ‘పావకధైగళ్‌’. ఒక్కోటి దాదాపు ముప్పయి నిమిషాల నిడివితో ఉన్నాయి. తొలి అంశం ‘తంగం’. థర్డ్‌ జెండర్‌ విఫలప్రేమ. ఆడ మగ కాని సెక్సువాలిటీకీ అస్తిత్వం ఉంటుందనే నిజాన్ని ఒప్పుకోలేని సమాజపు మూర్ఖపు ధోరణిని వివరిస్తుంది.

రెండో అంశం ‘లవ్‌ పన్నా ఉత్రనుమ్‌’. కుల, పురుష దురహంకార హత్య. కూతురు తమ కులమే కాదు, తమ ఆర్థికస్థాయికి తూగని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కరెంట్‌షాక్‌తో బిడ్డ ప్రాణం తీసిన తండ్రిని చూపిస్తుంది. మూడో అంశం ‘వాన్‌మగర్‌’. పదేళ్ల పిల్ల మీద ఇరవయ్యేళ్ల యువకుడు లైంగికదాడి చేస్తే పోలీసు కంప్లైంట్‌ ఇస్తే పదిమందికీ తెలిసి పరువు పోతుందని భయపడి ఆ పాపను చంపేయాలనే ఆలోచన చేస్తుంది ఆ బిడ్డ తల్లి. తర్వాత ఆ పాపపు తలపుకి ఉలిక్కిపడి కూతురిని హత్తుకుంటుంది. కాని జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పనివ్వని బలహీనతను వివరిస్తుంది. నాలుగో అంశం ‘ఊర్‌ ఇరవు’. ఇదీ కుల, పురుష దురహంకార హత్యోదంతమే. ప్రేమగా పెంచుకున్న కూతురు... చదువు ఇచ్చిన తెలివిడి, ఉద్యోగం ఇచ్చిన ఆర్థిక స్వాతంత్య్రంతో తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకునే ధైర్యం చేస్తుంది.

దీన్ని ధిక్కారంగా, కులంలో తన పెద్దరికానికి మచ్చగా భావిస్తాడు తండ్రి. కూతురు నిర్ణయాన్ని అంగీకరించినట్టు నటించి, గర్భవతి అయిన ఆమెను సీమంతం చేస్తామని పుట్టింటికి తీసుకెళ్తాడు. రాత్రి భోజనాల వేళ నీళ్లలో విషం కలిపి కూతురికిచ్చి, ఆమెను, ఆమె కడుపులోని బిడ్డను చంపేసి విజయగర్వాన్ని పొందుతాడు. ఇదీ ‘పావ కధైగళ్‌’. జరిగిన సంఘటనల ఆధారంగా ఓటీటీ స్క్రీన్‌ మీద కదిలిన చిత్రం. ఎలాంటి పూత లేకుండా సమాజంలోని కాఠిన్యాన్ని ప్రదర్శించిన సినిమా. దీన్ని చూస్తున్నంత సేపూ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇంత ఘోరమా అని రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకన్నా మహా పాతకాలు జరుగుతున్న లోకమే అయినా, అద్దంలో చూసేసరికి భయం. ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తాయి.

కరోనాతో వ్యాకులమైన ప్రపంచానికి కొంచెం ఆశ కావాలి. మనుషులను మనుషులు ప్రేమించుకునే వాతావరణం కావాలి. శూన్యంగా ఉన్న ఈ కాలాన్ని కాస్త కదిలించే ‘సానుకూల’ ఇరుసు కావాలి. అందుకే ‘పావ కధైగళ్‌’ మిశ్రమ స్పందనను వినిపిస్తోంది. ఆ నాలుగూ నిజాలే అని మెదడు చెప్తున్నా, ఈ ఘోరాలు ఆగాలి అని విచక్షణ కోరుతున్నా, ఇంత నిరాశ వద్దు అని మనసు విజ్ఞప్తి చేస్తోంది. దాని వినతినీ ఖాతరు చేద్దాం. నిజాన్ని సహిద్దాం. సున్నితంగా వ్యవహరిద్దాం. అదిగో అలాంటి ఆశను కల్పిస్తుంది ‘లూడో’ మూవీ. ఇదీ ఐదారు స్థాయిల సమ్మేళనమే! ‘ఫీల్‌గుడ్‌’, ‘భద్రలోక్‌’ నుంచి వచ్చిన పాత్రలు కావు. ప్రతిరోజూ పడుతూ, లేస్తూ సాగే జీవితాలే! ప్రేమ, నమ్మకం, ద్రోహం నేరాల తాలూకు అష్టాచెమ్మాలే!

పాప పుణ్యాల కోసం నరకం, స్వర్గం లేవు. ఆ చర్యల పర్యవసానాలే నరకం, స్వర్గం అని చెప్తుందీ సినిమా! జీవితం ఒక ఆట. విధి పందెంలో ఏది వచ్చినా స్వీకరించడమే. అనుగుణంగా సాగడమే. ఫలితాన్ని అనుభవించడమే. ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సినవి మనిషికి మనిషి అండగా ఉండటం. కుల మత లింగ భేదాలకు అతీతంగా చెలిమిని భరోసాగా ఇవ్వడం. ఎలాంటి అంచనాలు లేకుండా సాయంగా నిలవడం. తప్పులను క్షమిస్తూ, ఒప్పులను ప్రశంసిస్తూ సానుకూల వాతావరణాన్ని పెంచుకోవడం. వీటినే చూపిస్తుంది ‘లూడో’!

మింగుడుపడని జీవన తత్వాన్ని అలవోకగా మెదడుకి ఎక్కిస్తుంది. కరోనా కాలపు శూన్యాన్ని ఉత్తేజంతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంది. ‘పావ కధైగళ్‌’తో బరువెక్కిన మనసుని ‘లూడో’తో తేలికపరచుకోవచ్చు. ఆ శూన్యాన్ని ఈ ఉత్తేజంతో భర్తీ చేసుకోవచ్చు. నిరాశ వెన్నంటే ఆశ ఉంటుంది. ఆ రెండిటికీ వారధి నమ్మకం. పాతకాన్ని మింగేసే పందెం కోసం ఆడుతూనే ఉండాలి. ఆ పందెం పండుతుందనే నమ్మకంతో నిర్ణయాల గవ్వలను సరిచేసుకుంటూ సాగాలి.
-సమకాలమ్‌

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు