మోడల్‌ టు మాస్టర్‌ చెఫ్‌

8 Nov, 2020 08:57 IST|Sakshi
సారాటాడ్‌

సౌకుమార్యమే అక్కడ ప్రధాన అడుగు.  జిగేల్మనే కాంతుల మధ్య మెరవడమే అసలైన లక్ష్యం.  అలాంటి చోట తనను తాను నిరూపించుకుంది సారాటాడ్‌. మోడలింగ్‌లో విజయవంతంగా ఎదిగిన ఈ విదేశీయురాలు ఇప్పుడు మన భారతీయ వంటింటి మహారాణిగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రాంతీయ వంటకాలు ‘మహాభేష్‌’ అంటూ మాస్టర్‌ చెఫ్‌గా రాణిస్తోంది.

విదేశీయురాలు.. అందులోనూ మోడల్‌. భారతీయ ఆహారం పట్ల మక్కువ పెంచుకోవడమే కాకుండా ఆ వంటల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకోవడం సాధారణ విషయమేమీ కాదు. సారాటాడ్‌ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ నివాసి. 18 సంవత్సరాల వయస్సులో, మోడలింగ్‌ కోసం సిడ్నీకి వెళ్లింది. మోడలింగ్‌లో సక్సెస్‌ సాధించింది. ఐదేళ్లుగా సెలబ్రిటీ చెఫ్‌గా ప్రసిద్ది చెందింది. భారతీయ వంటకాల పట్ల మక్కువ పెంచుకుంది. పాకశాస్త్ర ప్రావీణ్యం సాధించింది. మాస్టర్‌ ఛెఫ్‌గా గోవాలో తన మొదటి రెస్టారెంట్‌ ప్రారంభించి భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది.

పదార్థాలను తెలుసుకుంటూ..
భారతీయ వంటకాల గురించి సారా మాట్లాడుతూ– ‘ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతాల ఆహారానికీ సొంత ప్రత్యేకత ఉంది. నేను అస్సాం నుండి కాశ్మీర్‌– గోవాకు ప్రయాణిస్తున్న ప్రతిసారీ, ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, పద్ధతులను చాలా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. వాటిని నేను తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తుంటాను. భారతదేశం వైవిధ్యభరితమైనది. ఇక్కడే ఉంటూ ప్రాంతీయ వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, ఎంతో మందికి వాటిని పంచాలనుకుంటున్నాను. ఈ విధానం ద్వారా ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, ఆహార సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంతో తెలుసుకోవచ్చు’ అని వివరించింది సారాటాడ్‌. 

అపోహలు తొలగించాలి
ఈ మాస్టర్‌ చెఫ్‌ గోవా తర్వాత మరో రెస్టారెంట్‌ను ఢిల్లీలో ప్రారంభించాలనుకుంటోంది. భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని కోరుకుంటున్నట్టుగా చెబుతోంది. ‘భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే, అది హోటళ్లలో వండినది. కానీ భారతీయుల ఇళ్లలో తింటున్న ఆహారం గురించి విదేశీయులకు అంతగా తెలియదు. యోగా పద్ధతులు, ఆయుర్వేద వంటకాలకు ప్రసిద్ధి ఈ దేశం. ఆరోగ్య దృక్పథం నుండి చూస్తే ఈ ఆహారం అత్యంత ఉత్తమమైనది, శక్తిమంతమైనది. భారతీయ ఆహారం నా వంట శైలిని పూర్తిగా మార్చివేసింది. ఈ ఆహారంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వాసన, రుచి ప్రత్యేకమైనవి. ఈ సుగంధ ద్రవ్యాలు లేకుండా నేను ఏ వంటకాన్నీ వండలేకపోతున్నాను.

అంతగా వీటితో మమేకం అయ్యాను’ అని తెలిపింది సారాటాడ్‌. అంతేకాదు, విదేశాలలో భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలనుకుంటున్నట్టుగా కూడా చెబుతోంది. ఏమైనా మన దేశీయ వంటగది, అందులో వండే వంటకాలు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో.. వాటి పట్ల విదేశీయులు ఎంత ఆసక్తిని చూపుతారని సారాటాడ్‌ని కలిస్తే తెలిసిపోతుంది. విదేశీయురాలై ఉండి భారతీయ వంటకాలను ప్రేమగా నేర్చుకుంటున్న సారాటాడ్‌ లాంటి వాళ్లను చూస్తే ఇక్కడి యువత మన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొంతైనా తప్పక వంటబట్టించుకుంటారు.

మరిన్ని వార్తలు