Parenting Tips: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేదా?.. ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే!

31 Oct, 2022 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? 

ఈ రోజుల్లో పిల్లల పెంపకం అంటే సాధారణమైన విషయం కాదు. పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల మనసులో చాలా కోరికలు ఉంటాయి. తమ పిల్లలు అన్ని విషయాల్లో ఉత్తమంగా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు.

అయితే.. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో అమ్మాయిలును అయితే ఒకలా.. అబ్బాయి అయితే... మరోలా చూస్తూ ఉంటారు. ఈ వ్యత్యాసం చూపించడాన్ని చాలామంది తల్లిదండ్రులు సమర్థించుకుంటారు. అయితే అది తప్పేనని, అలా తేడా చూపించడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం...

చాలామంది ఇళ్లలో ఆడపిల్ల విషయంలో ఎక్కువగా ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు.. ఇది తప్పు, అది తప్పు... ఇతరుల నుంచి రక్షించుకోవాలి అలాంటి విషయాలు చెబుతూ ఉంటారు.

ఇక అబ్బాయిలు ఉంటే... వంశాన్ని కాపాడాలి, తల్లిదండ్రులను పోషించాలి– లాంటి విషయాలు చెబుతూ ఉంటారు. అలా చెప్పడం తప్పని అనడం లేదు. అయితే అవే కాకుండా.. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. అవేంటో ఓసారి చూద్దాం...

►చాలా మంది మగ పిల్లలు.. తాము మగవారు అయినందుకు చాలా గొప్పగా ఫీలౌతూ ఉంటారు. ఇంట్లో వారి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అందుకు కారణం కావచ్చు. కాబట్టి.. పిల్లలకు మగ పిల్లలు మాత్రమే గొప్ప అని ఎప్పుడూ చెప్పకూడదు. ఇద్దరూ సమానమే... అయితే ఆడపిల్లలతో పోల్చితే మగపిల్లలు శారీరకంగా మాత్రం కాస్తంత బలంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. మీతో పాటు ఈ సమాజంలో ఆడపిల్లలు కూడా సమానమే అనే విషయాన్ని వారికి అర్థం అయేలా చెప్పాలి.

►మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం ఎలా తీసుకుంటామో.. ఎదుటివారికి అవసరమైనప్పుడు మనం కూడా అదేవిధంగా సహాయం చేయాలని పిల్లలకు నేర్పించాలి. వృద్ధులు, వికలాంగులు, మీకంటే చిన్నవాళ్లు ఎవరైనా రోడ్డు దాటడానికి సహాయం చేయడం లేదా సామాజిక కార్యకలాపంలో పాల్గొనడం వంటివి జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడతాయి అనే విషయాన్ని నేర్పించాలి.

►చిన్నా, పెద్ద, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ  గౌరవించడం నేర్పించాలి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న వయసు వారి నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి అనే విషయాన్ని మనం పిల్లలకు చెప్పాలి.

►కోపం అందరికీ వస్తుంది. అది సహజం. అయితే... ఆ కోపాన్ని అదుపు చేసుకున్నవారే గొప్పవారు అవుతారు. చూపించాల్సిన సమయంలోనే కోపం చూపించాలి. అందరిపై చూపించకూడదు. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాలని మనం పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే.. కోపం ఎక్కువగా ఉండేవారికి అందరూ దూరంగా ఉంటారు. ప్రశాంతంగా... నవ్వుతూ ఉండేవారినే అందరూ ఇష్టపడతారు. 

►ఇతరులను ఎఫ్పుడూ తక్కువ చేయవద్దు. ఏ వ్యక్తిని కించపరిచే హక్కు మనకు లేదని, తోటి వాళ్లతో ఎప్పుడూ ప్రేమతో వ్యవహరించాలనీ చెప్పండి. అవతలి వారిలో ఏవిధమైన ప్రత్యేకత లేనప్పటికీ, మీరు వారి పట్ల గౌరవం చూపించాలి. ఎదుటివారు ఏ విషయంలోనూ మీకంటే తక్కువ అని మీరు పిల్లలకు చెప్పకూడదు.

►అదేవిధంగా మీ పిల్లలకు సారీ, థ్యాంక్స్, ప్లీజ్‌ వంటి పదాలు ఎప్పుడు, ఎక్కడ అవసరం అయినా చెప్పడం నేర్పించండి. పిరికిగా ఉండటం మంచిది కాదు. ధైర్యంగా ఉండాలి. అందరితోనూ స్నేహం గా ఉండాలి అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాలి. ఈ టిప్స్‌ పాటిస్తే పిల్లలు   మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతారు.

చదవండి: Custard Apple: సీజనల్‌ ఫ్రూట్‌ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్‌ అణువుల వల్ల
ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్‌ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా?

మరిన్ని వార్తలు