బట్టలపై మరకలు పడ్డాయా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

11 Nov, 2023 15:35 IST|Sakshi

బట్టలపై మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్‌కి ఇద్దామంటే ఆ ధరకు కొత్తదే వస్తుందమే అనిపిస్తుంది. అయితే మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం. 
  
మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్‌ మాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఆస్పిరిన్‌లో ఉండే ఎసిటైల్‌సాలిసిలిక్‌ ఆమ్లం బట్టలపై పడిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది.   

తెల్లని దుస్తులను నాలుగైదు ఆస్పిరిన్‌ టాబ్లెట్లు వేసిన నీళ్ల బకెట్‌లో బాగా నానబెట్టండి. తరవాత బట్టల సబ్బుతో ఉతకడమో లేదా వాషింగ్‌ మెషీన్‌లో వేసి మామూలుగా ఉతికి జాడించి ఆరేస్తే సరి!  

 ► రక్తపు మరకలను తొలగించడానికి..
ఆస్పిరిన్‌ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను నానబెట్టండి. వేడినీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టం అవుతుంది.  చేస్తుంది.  

► నూనె, గ్రీజు మరకలకు..
ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక ముక్క మీద ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది.

 వక్కపొడి, పాన్‌ మసాలా మరకలు
పెరుగు లేదా మజ్జిగను మరక పడ్డ చోట ఉంచి పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో వస్త్రాన్ని కడగాలి. ఇది బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది.

 ►  టీ–కాఫీ మరకలు
టీ–కాఫీ మరకలు పడ్డప్పుడు ముందుగా గోరువెచ్చటి నీటిలో ఆ వస్త్రాన్ని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత లిక్విడ్‌ డిటర్జెంట్లో నానబెట్టాలి. తర్వాత మరక పడ్డ చోట చేతితో రుద్దితే మరకలు తొలగుతాయి. 
► టర్కీ టవళ్లు, దుప్పట్ల వంటి వాటిని బట్టలుతికే సోడా కలిపిన నీటిలో నానబెట్టి ఉతికితే త్వరగా శుభ్ర పడతాయి.

 

మరిన్ని వార్తలు