Pooranam: చదువుల తల్లీ నీకు వందనం

9 Feb, 2024 00:20 IST|Sakshi
రెండోసారి స్థలం పత్రాలను అప్పగిస్తున్న పూరణం

విద్యాదాత

కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్‌ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి.

ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్‌ ఆయి అమ్మాళ్‌. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది.

కెనెరా బ్యాంక్‌ క్లర్క్‌
మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి.

హటాత్‌ సంఘటన
పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి.

ముఖ్యమంత్రి స్టాలిన్‌ మొన్నటి రిపబ్లిక్‌ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్‌ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్‌లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్‌ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega