Khadi Fabric Everything You Need To Know: ఎంతోమంది నేతన్నలు ఉన్నా మోదీని కలిసి అవకాశం వాళ్లకే ఎందుకు?

30 Aug, 2023 13:20 IST|Sakshi

ఎర్రకోట అనగానే ఎవరికై నా పతాకావిష్కరణ గుర్తుకొస్తుంది. వినువీధిలో త్రివర్ణ పతాక రెపరెపలు చూడగానే మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అటువంటి వేడుకలో ఖాదీకి కూడా చోటు లభిస్తే.. నేరుగా దేశ ప్రధాని మోదీతో ముచ్చటించే అవకాశం లభిస్తే.. మన ముఖం పొందూరు జరీ ఖాదీ పంచె అంచులా మెరిసిపోతుంది. ఉత్సాహం ఉప్పొంగి మనసే ఉత్సవ వేదికగా మారుతుంది. సరిగ్గా అటువంటి అపురూప అనుభవమే ఇద్దరు పొందూరు ఖాదీ కళాకారుల సొంతమైంది.

స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన పొందూరు ఖాదీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, ప్రధానితో మాట్లాడే అపురూప క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని ఉత్సవాల్లో పాల్గొన్న నేతకారులు గర్వంగా చెబుతున్నారు. ఢిల్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారినే ఎందుకు ఎంపిక చేశారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఢిల్లీలో అనుభవాలు ఏమిటి? వారి నుంచే తెలుసుకుందాం. 


కాంతమ్మా.. కుశలమా..

ఈమె పేరు జల్లేపల్లి కాంతమ్మ. పొందూరు. వయసు 75. ఆరేళ్ల ప్రాయం నుంచి సంప్రదాయ ఖాదీ వస్త్రం తయారు చేస్తోంది. దేశంలోనే నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం గల అతికొద్ది మంది వ్యక్తుల్లో కాంతమ్మ ఒకరు. ముగ్గురు కుమారులు బాగానే స్థిరపడినా.. ఖాదీ మీద మక్కువతో ఆమె పాత ఇంటిలోనే ఉంటూ రోజుకు 6 గంటలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. కేవలం రోజుకు రూ.200 మాత్రమే సంపాదిస్తున్నా.. కోట్ల రూపాయల విలువైన తృప్తి కోసమే తాను ఈ పని చేస్తున్నానని గర్వంగా చెబుతున్నారు ఆమె. తాను 75 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని అంటే అది ఖాదీ పుణ్యమేనని.. చెబుతారు కాంతమ్మ.

అసలు కాంతమ్మ ఎంచుకున్న సంప్రదాయ విధానం ఏమిటి?

వాలుగు చేప ముల్లుతో పత్తిని శుభ్రపరచడం 
 

ఖాదీ వస్త్రం తయారీలో ఈ దశలు కీలకమైనవి..

నిడుచుటగా పిలిచే ప్రక్రియలో పత్తి గింజలను వేరు చేయడం
 

పత్తిని మెత్తగా తయారు చేయడం 

చిలపలు పోయడం

మరిచిపోలేని జ్ఞాపకం..
నేను చదువుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది.. ఖాదీ తయారీలో భాగమవ్వడమే. నేను ఏ రోజూ కష్టపడుతున్నాననే భావన నాలో రానీయను. ఇష్టంగా పనిలో నిమగ్నమవుతా. నన్ను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఖాదీ తయారీలో ప్రక్రియల్ని ఓపికగా వివరిస్తా. వారికి అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టను. ఖాదీ గొప్పతనాన్ని వారికి చెబుతా. ఢిల్లీ.. ఎర్రకోట ప్రధాన మంత్రి వంటి పదాలు వినడమే తప్ప.. నేను ఎప్పుడూ చూస్తానని కలలో కూడా ఊహించ లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు నాలాంటి సామాన్యురాలిని ఎర్రకోటకు పిలిచి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది.
– జల్లేపల్లి కాంతమ్మ, పొందూరు.

ఏకు చుట్టడం 
 

జరీ నేతలో మొనగాడు
చిత్రంలో వీరిద్దరి పేర్లు భద్రయ్య, లక్ష్మి. భార్యభర్తలు. ఊరు పొందూరు. ఇద్దరూ నేతకారులే. జరీపంచె నేతలో ఒకే ఒక్కడు ఈ భ ద్రయ్య. మంచి నైపుణ్యం ఈయన సొంతం. ఏఎన్నార్‌ పేరుతో పిలిచే ఖాదీ పంచెకు బంగారం వర్ణంలో ఉండే అంచును అత్యంత అద్భుతంగా నేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇంటర్‌ వరకు చదువుకున్న భద్రయ్య వృత్తిలో సంతృప్తి వెతుకునే వ్యక్తి త్వం ఉన్న మనిషి. రోజుకు కేవలం రూ.500 మాత్ర మే సంపాదించే ఈయన జరీనేతలో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది నేతన్నలలో మొనగాడే. ఈ నేతకు ఇద్దరు వ్యక్తులు అవసరం కావడంతో భార్య సహకారంతో మనసుకు నచ్చిన పనిచేసి దేశప్రధాని మనసును గెలుచుకున్నాడు ఈ నేతన్న.

ఏమిటీ జరీ నేత..ఖరీదు ఎందుకంత..!
పంచెకు అంచు అందం. అంచు ఎంత ఎక్కువ తళుక్కుమంటే అంత ఖరీదైనదని అర్థం. శ్వేత, గోధుమ వర్ణంలో సున్నితంగా ఉండే ఖాదీ జరీపంచెలు కాస్త ఖరీదైన వ్యవహారం. మామూలు ఖాదీ పంచె రూ. 600 నుంచి రూ.800 మధ్యలో లభ్యమవుతుంది. ఒక్కో జరీ పంచె ఖరీదు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుందంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.

జీవితాంతం గుర్తుండిపోయేలా..

ఉదయం లేవడం.. వృత్తిలో నిమగ్నమవ్వడం. నా కుటుంబం. ఇదే నా దినచర్య. ఢిల్లీకి బయల్దేరాలని ఖాదీ బోర్డు సభ్యులు చెబితే ఆశ్చర్యమేసింది. అదీ ఎర్రకోటలో జరిగే మువ్వన్నెల వేడుకకు.. ప్రధానిని కలిసేందుకు అంటే చాలా గర్వపడ్డాను. ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూశా. ఓ నేతకారుడిగా నాకు దక్కిన ఈ గొప్పఅవకాశం.. ఆ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నాకు వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే నా భార్యతో సహా నేను ఢిల్లీకి వెళ్లడం జీవితంలో మరిచిలేనిది.
– బళ్ల భద్రయ్య, పొందూరు
 

మరిన్ని వార్తలు