Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...

16 Dec, 2023 05:50 IST|Sakshi
వృద్ధురాలితో ప్రణవ్‌

దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్‌ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్‌.

హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్‌ నారాయణ్‌ శుక్లా. ప్రణవ్‌ శుక్లా ప్రొఫెసర్‌ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్‌ తరువాత మెడిసిన్‌ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్‌ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్‌ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.

కాలేజీ రోజుల్లో...
ప్రణవ్‌ శుక్లా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్‌లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్‌ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్‌ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.

ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం..
ప్రణవ్‌ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్‌’ పేరిట ఓల్డేజ్‌ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు.

వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్‌ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు.

ఆవులు పెంచుతూ...
ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్‌ అండ్‌ గోదామ్‌ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్‌ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు.
 
అందుకే పిల్లలు వద్దనుకున్నాం
కాలేజ్‌ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము.

>
మరిన్ని వార్తలు