మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..

28 Dec, 2022 16:00 IST|Sakshi

ప్రొఫెసర్‌ గూడూరు మనోజతో మాటా మంతి

ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్‌ యూరోపియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్, నాన్ట్స్‌’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్‌ ఎ డైలాగ్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్‌ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. 


‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్‌ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజ్, లిటరేచర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్‌’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్‌ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను.  
 
సంగీతసాధనాల అధ్యయనం
ఫ్రాన్స్‌ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్‌ వరల్డ్‌ లిటరేచర్స్‌ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్‌ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్‌ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది.

తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్‌ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్‌లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్‌ లిపికి కంప్యూటర్‌ ఫాంట్‌ తయారు చేయగలిగాం. గోంద్‌ భాష యూనికోడ్‌ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్‌ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. 
 

ఆద్యకళకు ఆహ్వానం 

‘ఇండియన్‌ యూరోపియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్, నాన్ట్స్‌’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్‌ ఎ డైలాగ్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్‌ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్‌ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్‌ ఆఫ్‌ ఎస్టాబ్లిషింగ్‌ ఎ మ్యూజియమ్‌’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్‌ పరిశోధకులు డేనియల్‌ నాజర్స్‌తోపాటు అనేక మంది ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం.

కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్‌ ఆఫ్‌ ఎస్టాబ్లిషింగ్‌ ఎ మ్యూజియమ్‌’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్‌ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్‌ చేయండి: ఉందిలే మంచి టైమ్‌ ముందు ముందూనా...)

చేయాల్సింది ఇంకా ఉంది 
ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్‌ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్‌ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు  మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్‌. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది.
– వాకా మంజులారెడ్డి  


శబ్దం– సాధనం 

ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్‌ వర్క్‌. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్‌ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్‌ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్‌ మెథడాలజీలో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. 
– ప్రొఫెసర్‌ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు