కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేశారా? ఈ విషయాలు తెలిస్తే..

14 Nov, 2023 15:26 IST|Sakshi

లావవుతామనే భయంతో చాలామంది కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేస్తున్నారు. కొందరైతే నెయ్యి తినడం ఎప్పుడో మానేశారు. అయితే శరీరంలోని ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కాబట్టి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్‌ ఎంతో అవసరం. అలాగని అన్నిరకాల కొవ్వులూ ఆరోగ్యం కాదు. ఇంతకూ ఆరోగ్యకరమైన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందామా?
 

అవకాడో: 
మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్‌గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్‌ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  

ఆలివ్‌ ఆయిల్‌:
వేపుళ్లకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్‌ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్‌ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. 

పెరుగు:
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

కొబ్బరి:
కొబ్బరి లేదా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్‌ ఫుడ్‌ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

చేపలు:
చేపలలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే లక్షణాలున్నాయి. అందుకే ఇతర విధాలైన మాంసాహారాలకు దూరంగా ఉండమని హెచ్చరించే వైద్యులు సైతం పరిమితంగా అయినా చేపలు తీసుకోవచ్చునని చెబుతారు. 

బాదం పప్పు, జీడిపప్పు:
వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటాం. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. అందువల్ల బాదం, జీడిపప్పు తీసుకోవడం మంచిది. బాదం పప్పును నీటిలో నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం మంచిది. జీడిపప్పును అయితే వేయించకుండా నేరుగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ పెంపొందుతుంది.

నెయ్యి:
ఇదివరకటిలో ఆహారంలో నేతిని బాగా ఉపయోగించేవారు. అరిసెలు, గారెలు వంటి వాటిని నేతితోనే చేసేవారు. అయితే రానురానూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిజానికి నేతిలో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. అలాగని ముద్ద ముద్దకీ నెయ్యి వేసుకోవడం, నేతితోనే చేసిన డీప్‌ ఫ్రైలు విపరీతంగా తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి మంచిది. 

మరిన్ని వార్తలు