స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్‌ యూనివర్శిటీ వరకు!

21 May, 2022 00:45 IST|Sakshi
సరిత మాలి

దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం...

సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్‌ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్‌ స్కూల్‌లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్‌ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్‌ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి.

ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు.
ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని!
ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి.
‘జేఎన్‌యూలో అడ్మిషన్‌ దొరకడం అంతేలికైన విషయం కాదు’

‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్‌ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది.
‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత.

యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు.
పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్‌ రిసెర్చ్‌ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్‌వేర్‌ సైడ్‌ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది.
 
జేఎన్‌యూలో ఎంఫిల్‌ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్‌ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం.
‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి.

మరిన్ని వార్తలు