‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్‌’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా..

22 Feb, 2024 08:01 IST|Sakshi

"మధ్యప్రదేశ్‌కు చెందిన సరోజ్‌ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్‌ను ‘ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌’లోకి కన్వర్ట్‌ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్‌ మ్యాజిక్‌ పికెల్‌ ఇండియా’ను స్టార్ట్‌ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది."

మధ్యప్రదేశ్‌లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్‌ మారుస్తోంది సరోజ్‌. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్‌ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్‌లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్‌కు ‘శభాష్‌’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్‌ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్‌.

పందొమ్మిది సంవత్సరాల అమిత్‌ ‘బ్రాండ్‌ బిల్డింగ్‌’ అనే డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్‌’ అనే మాట అమిత్‌ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్‌ మ్యాజిక్‌ పికిల్‌ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్‌. ‘మామ్స్‌ మ్యాజిక్‌ పికిల్‌ ఇండియా బ్రాండ్‌’ గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్‌.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ డిమాండ్‌ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్‌ ఆర్డర్‌ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్‌.

‘మామిడి సీజన్‌లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్‌ పికెల్స్‌ అనేది పర్‌ఫెక్ట్‌ బిజినెస్‌ ఛాన్స్‌ అనుకున్నాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లలో మా బిజినెస్‌కు సంబంధించిన పేజీలను క్రియేట్‌ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్‌ ప్రింట్‌ చేయించాను. మధ్యప్రదేశ్‌ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్‌.

పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్‌. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్‌ మార్కెటింగ్‌ స్కిల్స్‌ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది.

నా కుటుంబం నా బలం!
కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్‌ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్‌ ప్రజాపతి

ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..!

whatsapp channel

మరిన్ని వార్తలు