Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! | Sakshi
Sakshi News home page

పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! కానీ ఆనవాలై వెలగనున్నాడు..!!

Published Thu, Feb 22 2024 7:34 AM

Ameen Sayani Iconic Radio Presenter Life - Sakshi

‘బెహనో.. ఔర్‌ భాయియో..’ ఈ గొంతుతో ప్రేమలో పడని రేడియో శ్రోత ఉండేవాడు కాదు. ‘బినాకా గీత్‌మాల’ టాప్‌ 13లో ఏ పాట నిలుస్తుందో చూద్దామని వారమంతా ఎదురుచూపులు. నవ్వుతూ నవ్విస్తూ గుంజిపారేసే ఆకర్షణీయమైన గొంతుతో దశాబ్దాల పాటు పాటలను పంచిన రేడియో ప్రెజెంటర్‌ అమిన్‌ సయానీ తన 91వ ఏట బుధవారం వీడ్కోలు తీసుకున్నాడు. ఇకపై భారతీయ సాంస్కృతిక ఆనవాలై అతను వెలగనున్నాడు.

పాటలు విరబూస్తాయి. అదిగో అల్లంత దూరాన ఒక చామంతి పూస్తుంది. ముళ్లను వెనక్కు నెడుతూ ఒక రోజా మెడ నిక్కి చూస్తుంది. గుబురు చాటున మల్లెమొగ్గ ఒకటి సిగ్గుతో మొహం దాచుకుంటుంది. గరిక పచ్చతావులో గడ్డిపూవు వర్ణనకు అందని రంగుతో కాంతిలీనుతుంది. వాటి మానాన అవి ఉన్నప్పుడు మన చూపు పడకపోవచ్చు. పడినా వాటి సౌందర్యమేమిటో తెలియకపోవచ్చు.

అప్పుడొక పూలమాలి వస్తాడు. ఒక పువ్వు సువాసన ఎంత ప్రత్యేకమైనదో చెబుతాడు. మరో పూలరెక్క వయ్యారాన్ని చూపి విస్మయపడతాడు. ఒక పువ్వును నాసిక దగ్గర చేర్చడమే భాగ్యమంటాడు. ఒక పువ్వునలా కొమ్మకు వదిలిపెట్టమని మారాము చేస్తాడు. అప్పుడా పూల మీద మనకు ప్రేమ కలుగుతుంది. మనమూ వాటికి మాలిగా మారాలనుకుంటాము. గుండెకు దగ్గరగా చేర్చుకుంటాము. హృదయంతో వాటి పోషణకు పూనుకుంటాము.

అమిన్‌ సయానీ చేసింది అదే..
రేడియో సిలోన్‌లో హిందీ సినిమా పాటలను శ్రోతలకు చేర్చడం. వాటిపై ప్రేమను పంచడం. వాటిని పాడుకుంటూ, కూనిరాగాలు తీస్తూ, ఆ మనోహర మాయలో చిక్కుకుంటూ జనం తమ బతుకు బాదరబందీని కాసేపు మరచిపోయేలా చేయడం. 1952 డిసెంబర్‌లో మొదటి షోగా మొదలైన ‘బినాకా గీత్‌మాల’ బినాకా టూత్‌పేస్ట్‌ వారి స్పాన్సర్డ్‌ప్రోగ్రామ్‌. ప్రతి బుధవారం సాయంత్రం రేడియో సిలోన్‌లో ప్రసారమయ్యేది. టాప్‌ 13తో మొదలయ్యి టాప్‌ 1 వరకూ కౌంట్‌డౌన్‌గా పాటలు ప్రసారమయ్యే ఆ షో చివరలో తర్వాతి వారం కోసం ‘లిస్ట్‌’ అయిన పాటలను చెప్పి వాటిని శ్రోతలు ఏ వరుసలో మెచ్చుతారో రాసి పంపమనేవారు.

టాప్‌ వన్‌గా నిలిచే పాటను ఎక్కువమంది దేనిని ఎంపిక చేస్తారో దానికి ఆ ర్యాంక్‌ ఇచ్చేవారు. టాప్‌ 1ను సూచించిన వారి పేర్ల నుంచి జాక్‌పాట్‌ తీసి ఒక శ్రోతకు 100 రూపాయల బహుమతి ఇచ్చేవారు. అమిన్‌ సయాని మొదటి షో చేసేసరికి ఎంత హిట్‌ అయ్యిందంటే మరుసటి వారానికి 9 వేల ఉత్తరాలు స్పందనగా అందాయి. సంవత్సరం గడిచే సరికి వారం వారం వచ్చే ఉత్తరాల సంఖ్య 65 వేలకు చేరుకుంది. పోస్టాఫీసు వాళ్లు, రేడియో స్టేషన్‌ వారూ పిచ్చెత్తి పోయేవారు. తర్వాత ఈ రెస్పాన్స్‌ తంతును ఆపేసి సయానీ ఎంపిక మీద, రికార్డుల అమ్మకాలను బట్టి టాప్‌ 1ను డిసైడ్‌ చేసేవారు.

ఏ జందగీ ఉసీకి హై..
అమిన్‌ సయానీ చేసిన బినాకా గీత్‌ మాలాలో ఏ వారం ఏ సింగర్‌ పాడిన పాట టాప్‌ సాంగ్‌గా నిలుస్తుందో తెలుసుకోవడం  శ్రోతలకే కాదు సినీ రంగ దిగ్గజాలకు కూడా పెద్ద ఆసక్తిగా ఉండేది. బినాకా చార్ట్‌లో చోటు చేసుకోవడం గౌరవంగా భావించేవారు. ఇక కొన్ని పాటలైతే వారాల తరబడి టాప్‌ 1గా నిలిచి ఆ గాయకులకు, సంగీత దర్శకులకు క్రేజ్‌ను సంపాదించి పెట్టేవి.

సంవత్సరం చివరలో అమిన్‌ సయానీ ‘సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అంటూ ఒక పాటను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో ‘ఏ జందగీ ఉసీకి హై’ (అనార్కలీ– 1953), ‘జాయెతో జాయె కహా’ (టాక్సీ డ్రైవర్‌ – 1954), ‘మేరా జూతా హై జపానీ’ (ఆవారా – 1955), ‘ఏ దిల్‌ ముష్కిల్‌ జీనా యహా’ (సి.ఐ.డి – 1956)... ఇలా పాటలు శ్రోతల మెచ్చుకోలుతో వెలిగేవి. బినాకా గీత్‌మాలాలో ఎక్కువసార్లు టాప్‌ ΄÷జిషన్‌లో నిల్చున్న గాయని లతా. ఆ తర్వాత రఫీ.

ఆ మృదుత్వం.. ఆ దగ్గరితనం..
అమిన్‌ సయానీ గొంతు, వాడే సులభమైన భాష, ఉచ్చారణ, మధ్య మధ్య జోకులు, కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇవన్నీ కలిసి షోను విపరీతంగా హిట్‌ చేశాయి. అమిన్‌ రేడియో అనౌన్సర్లకు మార్గదర్శి అయ్యాడు. ‘గోల్డెన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా రేడియో’ అనిపించుకున్నాడు.

జీవితాంతం ఫ్రీలాన్సర్‌గానే అమిన్‌ రేడియో సిలోన్‌లో, వివి«ద్‌ భారతిలో షోస్‌ చేశాడు. అలాగే ఎన్నో అడ్వర్‌టైజ్‌మెంట్లలో ఆయన గొంతు వినిపించేది. సినిమా వాళ్ల అవార్డు ఫంక్షన్లలో, మ్యూజిక్‌ ప్రోగ్రాముల్లో అమినే యాంకర్‌. అంటే ఇవాళ దేశంలో ఉన్న పాపులర్‌ అనౌన్సర్లకు, యాంకర్లకు సయానీ సిలబస్‌ సెట్‌ చేసి వదిలాడు. ‘సినిమా పాటలే మన దేశంలో సగటు ప్రజలందరినీ కలిపి ఉంచాయి’ అంటాడు అమిన్‌ సయానీ.

బొంబాయిలో పుట్టి పెరిగి ముంబైలోనే తుదిశ్వాస వదిలిన అమిన్‌ సయాని ఆల్‌ ఇండియా రేడియో ఉజ్వల రోజులను, గోల్డెన్‌ ఎరా ఆఫ్‌ హిందీ మ్యూజిక్‌ను ప్రస్తావించినప్పుడల్లా తన ప్రియమైన గొంతుతో పునరుత్థానం చెందుతూనే ఉంటాడు.

ఇకపై కూడా అందమైన పూలు ఎన్నో పూయవచ్చు. కాని వాటిని ఊరికూరికే చూస్తూ పదేపదే సంబరపడిపోయే ఒక మాలి మరి ఉండడు. అదంతా గతం. సుందరమైన గతం. ఎంతో శ్రావ్యంగా పదిలపరుచుకునే గతం. అది సినీ సంగీతాన్ని ఇష్టపడే వారి సొంతమైన జ్ఞాపకం.

ఇవి చదవండి: Karishma Mehta: కథలు మార్చగలవు

Advertisement
Advertisement