ఏడేళ్ల కొడుక్కి మామ్స్‌ మనీలెసన్‌! మీరూ ట్రై చేయండి..

2 Oct, 2021 11:06 IST|Sakshi

చిన్నప్పుడు నేర్చుకున్న విద్యాబుద్ధులే రేపటి బంగారు భవిష్యత్‌కు దారిచూపుతాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు, గురువులు నేర్పిన పాఠాలే జీవితంలో ఉన్నతస్థానంలో నిలబెడతాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని విలువలతో పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లి. ఈమె పేరు తెలియనప్పటికీ ఆమె ఐడియా మాత్రం ఎందరో తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తోంది.  

ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అబ్బాయికి మంచి విద్యాబుద్ధులతోపాటు, డబ్బు విలువను తెలియజేయాలనుకుంది ఆమె. ఈ క్రమంలోనే రోజూ తన కొడుకుతో కొన్నిరకాల పనులు చేయిస్తోంది. రోజూ బెడ్‌ను తనే సర్దుకోవడం, పళ్లు తోముకోవడం, తన బాత్‌రూంను శుభ్రపరచడం,  మురికి బట్టలను వాషింగ్‌మిషన్‌లో వేయడం వంటి పనులు అన్ని అతనే చేయాలి. ఆ రోజున మొత్తం పనులు పూర్తయితే ఒక డాలరు ఇస్తుంది. నెల మొత్తం వచ్చిన డాలర్‌లన్నింటిని కలుపుకుని తనకిష్టమైన బొమ్మలు, చాక్లెట్లు కొనుక్కుంటాడు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ కుర్రాడు తనకు వచ్చిన నెల జీతాన్ని ఇంటికి అద్దెకట్టడం, తన రూమ్‌లో విద్యుత్‌ను ఉపయోగించినందుకు కరెంట్‌ బిల్లు, వాడిన నెట్‌కు ఇంటర్నెట్‌ బిల్లుని కడుతున్నాడు. 

ఒకనెల ఏదైనా కారణంతో బిల్లులు కట్టకపోతే వాటిని తరువాతి నెలలో కట్టేలా అమ్మతో ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇలా చిన్నవయసు నుంచే డబ్బు ప్రాముఖ్యత, విలువను అర్థం చేసుకోవడం ద్వారా తన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుకోగలడని ఆ తల్లి చెబుతోంది. తన కొడుకుకి డబ్బు విలువ గురించి ప్రాక్టికల్‌గా చెబుతోన్న తల్లి వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో చాలామంది నెటిజన్లు కొడుకుని బాగా పెంచుతున్నారు అని అభినందిస్తున్నారు. 

మరికొంతమంది ఈ ఐడియా బాగుంది కానీ పిల్లాడికి ఇంకా ఏడేళ్లే కదా! అంటున్నప్పటికీ, మొక్కై వంగనిది మానై వంగునా అంటారు కదా! లేతవయసులో ఏది చెప్పినా వెంటనే నేర్చుకునే మానసిక స్థితిలో పిల్లలు ఉంటారు. అందువల్ల ఆ తల్లి కొడుకులు చేస్తున్నది చాలా మంచి పని. చిన్న వయసు నుంచే పిల్లలకు ఇంతటి లోతైన విషయ అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్‌ను మరింత మంచిగా నిర్మించుకోగలుగుతారు.  

చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..

మరిన్ని వార్తలు