Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!

28 Dec, 2022 12:42 IST|Sakshi
యెన్నం సత్యం

నివాళి

సత్యం! 30, 35 ఏళ్ల  క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. 
నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది.

చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్‌ టైటిల్‌లో ‘అగర్‌ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్‌ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్‌ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు.

అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్‌ మేకర్‌ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. 

పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు...
‘అందరికీ జేబులు
కుట్టేవాడు
చాయ్‌ బీడీలకు అప్పు పడ్తడు’

‘అమ్మకు
కన్నీళ్లే కళ్లద్దాలు
వాటితోనే కాజాలు కుట్టేది’

అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్‌ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు.

యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!)

– జూకంటి జగన్నాథం

మరిన్ని వార్తలు