రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు

7 Nov, 2023 08:32 IST|Sakshi

బెంగళూరు: రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక, ఒడిశా మాజీ స్పీకర్లు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ(87) ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూయగా, ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్‌ మొహంతి(67) భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

1936 ఆగస్టు 26న జన్మించిన దారాదహళ్లి బైరేగౌడ.. రాజకీయంగా సుధీర్ఘసేవలు అందించారు.  కర్ణాటక స్పీకర్‌గా మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. జనతా దళ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కొనసాగింది. 1983-85 వరకు స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్‌ మొహంతి(67) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహంతి కన్నుమూశారు. 2004-08 మధ్య ఒడిశా ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మెహంతీ.. పూరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.  2014లో దుండగుల కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. 
 

ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు

మరిన్ని వార్తలు