ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి కిరాతకంగా హత్య చేసిం'ది'

19 Jun, 2022 13:02 IST|Sakshi
ప్రీడా-ఎలిస్‌ ఊహాచిత్రం

ఎలిస్‌–ఫ్రీడా విషాద గాథ 

కులమో మతమో.. ఆస్తో అంతస్తో.. కారణమేమైనా ఇరు కుటుంబాలకు నచ్చని ప్రేమకథల్లో విషాదాంతాలే ఎక్కువ. ఒకరి కోసం ఒకరు బతకలేనప్పుడు.. ఒకరి కోసం ఒకరు చావడమే మేలని తెగించిన సందర్భాలకు సాక్ష్యాలెన్నో చరిత్రలో. అయితే విఫలమైన ప్రేమలోంచి పుట్టుకొచ్చే ఉన్మాదం ఎంతకైనా తెగిస్తుంది. అదే జరిగింది ఎలిస్‌–ఫ్రీడా జీవితాల్లో. అయితే ప్రేమకు కులమతాలే కాదు లింగబేధాలు కూడా ఉండవని చెప్పిన తొలినాళ్ల కథ ఇది.

అది 1892, జనవరి మొదటివారం. అమెరికాలోని టెన్నెసీ, మెంఫిస్‌లోని 17 ఏళ్ల ఫ్రీడా వార్డ్‌ దారుణ హత్య.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. చంపింది ఎవరో కాదు తన ఫియాన్సీ ఎలిస్‌ మిషెల్‌. అంతకుముందు ఏడాది.. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో ప్రేమలేఖలు రాసుకున్నారు. ఎంతో ఇష్టంగా ఉంగరాలు మార్చుకున్నారు.

ప్రాణంగా ప్రేమించిన మనిషే తన ప్రాణాలు తీస్తుంటే ఫ్రీడా నిస్సహాయంగా కూలబడిన క్షణాల గురించి.. ఆమె సోదరి.. ప్రత్యక్షసాక్షి.. ఎడా కన్నీటి పర్యంతమవుతూ జరిగిందంతా కళ్లకు కట్టింది. ‘నేను, మా చెల్లి (ఫ్రీడా) మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ మిసెస్‌ కింబ్రోగ్‌ని కలవడానికి మెంఫిస్‌ వెళ్లాం. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ఎలిస్, వాళ్ల అక్క లిల్లీ .. ఇద్దరూ కలసి గుర్రపు బగ్గీలో మమ్మల్ని వెంబడించారు. మేము ఉండే గోల్డ్‌డస్ట్‌కి వెళ్తున్న దారిలో ఎలిస్‌.. మా చెల్లిని చేయి పట్టుకుని లాగి.. రేజర్‌తో దాడిచేయడంతో నేను షాక్‌ అయ్యాను. వెంటనే తేరుకొని ఎలిస్‌ని కాలితో తన్ని కిందకు తోశాను. గొడుగుతో ఎలిస్‌ని ఆపేందుకు ట్రై చేస్తూ.. ఫ్రీడాని పారిపోమని హెచ్చరించాను.


క్షణాల్లో నన్ను తోసేసిన ఎలిస్‌.. ఫ్రీడా వెంట పగబట్టిన తోడేల్లా పరుగుతీయడం కళ్లరా చూశాను. అలా నా చెల్లిని వెంబడించి దొరకబుచ్చుకున్న ఎలిస్‌.. ఫ్రీడా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి రేజర్‌తో కసుక్కున ఆమె మెడ కోయడం నేను చూశాను. ఎడమ చెవి కింద నుంచి కుడి చెవి వరకూ మెడ లోతుగా తెగడంతో క్షణాల్లో ఫ్రీడా కూప్పకూలిపోయింది. ఎలిస్‌ తనను చంపడమేంటనే అయోమయస్థితిలోనే నేలకొరిగింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రీడా చనిపోయింది.. నా చెల్లి ఫ్రీడా చనిపోయింది’ అంటూ ఎడా కోర్టు బోనులో కుమిలి కుమిలి ఏడుస్తుంటే అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి.

అసలు ఎవరీ ఎలిస్‌? తనకు ఫ్రీడా ఎలా తెలుసు? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని.. ఎందుకు వెంబడించి మరీ చంపాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిని నిలకడగా ఉండనివ్వలేదు. హత్య జరిగిన మరునాడే ఎలిస్, లిల్లీల అరెస్ట్‌తో దర్యాప్తు వేగవంతమైంది. అప్పటి దాకా ఈ కేసుపై దృష్టి పెట్టనివారిని కూడా ఆశ్చర్యపరచే ఒక విషయం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. ఎలిస్‌ అబ్బాయి కాదు. అమ్మాయి అని. నిజమే ఇది ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ.

ఎలిస్, ఫ్రీడాలు కలసి చదువుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన వారే. ప్రాణస్నేహితులు. ఆ స్నేహబంధం అంతకు మించిన అనుబంధంలా ఎప్పుడు మారిందో వాళ్లకు కూడా తెలియదు. వారి సన్నిహితుల్ని ఆరా తీస్తే.. 1890 నుంచే వారు ప్రేమలో ఉన్నారని తేల్చారు. ‘రెండేళ్ల క్రితమే వారి స్నేహం హద్దులు దాటి.. రొమాన్స్‌గా మారింది. పబ్లిక్‌గానే కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకునేవారు. అయితే అప్పటికే చాలామంది ఆడపిల్లలు తమకు కాబోయే భర్తతో ఎలా ఉండాలో ఇతర ఆడపిల్లలతో రిహార్సల్స్‌ చేస్తుండటం సాధారణమైపోయేసరికి వాళ్ల వ్యవహారమూ అందులో భాగమే అనుకుని ఎవరం పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు స్కూల్‌ టీచర్స్, స్టూడెంట్స్‌. 

అయితే ఫ్రీడా, ఎలిస్‌ల తీరును ఫ్రీడా ఫ్యామిలీ ముందే పసిగట్టింది. కావాలనే ఎలిస్‌కి దూరంగా అర్కాన్సాస్‌లోని గోల్డ్‌డస్ట్‌కి మకాం మార్చింది. ఆ దూరం ఇరువురిలో విరహాన్ని పెంచిందే తప్ప.. ప్రేమని తుంచలేదు. 1891లో ఓ రాత్రి ఫ్రీడా సూట్‌కేస్‌ సర్దుకుంటూ ఎడా కంటపడింది. వెంటనే ఫ్రీడాని బంధించిన ఎడా.. ఆమె దగ్గరున్న ప్రేమ లేఖలను లాక్కుని చదవడం మొదలుపెట్టింది. 

‘డియర్‌ ఫ్రీడా, ఈ లెటర్‌తో పాటు ఓ రింగ్‌ పంపిస్తున్నాను. దాన్ని నువ్వు పెట్టుకో.. దీని అర్థం మన పెళ్లి అయిపోయినట్లే. మనం సెయింట్‌ లూయీస్‌కి పారిపోదాం. అక్కడ నేను ఎల్విన్‌ జే వార్డ్‌ అనే అబ్బాయి పేరుతో అందరికీ పరిచయం అవుతాను. నిన్ను నా భార్యగా పరిచయం చేస్తాను. అప్పుడిక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం’ అంటూ ఎలిస్‌.. ఫ్రీడాకి రాసిన చివరి లేఖను చదివి.. షాక్‌ అయింది ఎడా. వెంటనే ఆ లేఖను పెద్దవాళ్లకు చూపించింది. నాటి నుంచి ఫ్రీడాపై ఇంట్లో ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఆ ఇరువురి మధ్య ఉత్తరాలు కూడా బంద్‌ అయ్యాయి. ఇవన్నీ దర్యాప్తులో తేలిన నిజాలు.

ఫ్రీడా హత్యతో లిల్లీకి ఎలాంటి సంబంధం లేదని భావించిన కోర్ట్‌.. పది వేల డాలర్ల ఫైన్‌ విధించి, ఆమెను విడుదల చేసింది. ఎలిస్‌కి మానసిక స్థితి బాగోలేదని, ఎలిస్‌ పర్సనాలిటీ అమ్మాయిలానే ఉన్నా.. మనస్తత్వం, లక్షణాలు  మాత్రం అబ్బాయివే అన్న వాదన తెరపైకి తెచ్చాడు ఎలిస్‌ తరపు లాయర్‌. ఫ్రీడా దూరమయ్యాక తట్టుకోలేని ఎలిస్‌.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వాదనలో వినిపించారు.పది రోజుల వాదనలో చివరిరోజు.. జడ్జ్‌ తీర్పు కోసం, ఎలిస్‌ ఇచ్చే వివరణ కోసం కోర్టుకు వేలాదిమంది తరలి వచ్చారు. ఫ్రీడా కోసం ఆత్మహత్య చేసుకునేంతగా ప్రేమించిన ఎలిస్‌ ఎందుకు ఆమెనే చంపింది? ఇదే అందరి మనసుల్ని రగిల్చిన ప్రశ్న. 

‘నాకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కడానికి వీల్లేదని అనుకున్నాను కానీ చంపాలనే కసి మాత్రం లేదు. ఎప్పుడైతే ఎడా నన్ను అడ్డుకుందో.. అప్పుడు ఫ్రీడాను చంపాలనే కసి కలిగింది. అందుకే వెంబడించి చంపేశాను’ అని కోర్టులో చెప్పింది ఎలిస్‌. అంతా విన్నాక ఎలిస్‌కి మానసిక పరిస్థితి సరిగా లేదని నమ్మింది కోర్టు. ఎలిస్‌ని టెన్నెసీలోని బొలీవర్‌ దగ్గరున్న మెంటల్లీ చాలెంజ్డ్‌ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. దాంతో 1892 నుంచి 1898... చనిపోయే వరకూ ఎలిస్‌ అక్కడే ఉంది. అయితే ఆమె క్షయ వ్యాధి సోకి చనిపోయిందని కొందరు.. వాటర్‌ టవర్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఫ్రీడా హత్యపై ఎలిస్‌ సరైన వివరణ ఇవ్వకపోవడంతో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. 

ఎలిస్‌ కంటే ఫ్రీడా అందగత్తె. చదువుకునే రోజుల్లో కుర్రాళ్లంతా ఫ్రీడా వెంటే పడేవారు. అది చూసినప్పుడల్లా ఎలిస్‌ అసూయపడేది. ఫ్రీడా తననే ప్రేమిస్తుంది కాబట్టి ఆ ఈర్ష్యని బయటపెట్టేది కాదు. హత్య జరిగిన రోజున ఫ్రీడాను చంపే ఉద్దేశం లేని ఎలిస్‌.. ఎడా జోక్యంతో రెచ్చిపోయి పాత అసూయనూ బయటపెట్టి అప్పటికప్పుడు ఆమె మెడ కోసి చంపేసింది’ అనేది ఒక పుకారు. ‘హత్య జరిగిన రోజున... ఓ అజ్ఞాత వ్యక్తిని ఎలిస్‌ గమనించింది. అతడు కచ్చితంగా ఫ్రీడా కోసమే వచ్చి ఉంటాడనే అనుమానంతో ఫ్రీడాను హత్య చేసి ఉంటుంద’ని ఇంకో పుకారు. దాన్ని బలపరచే స్థానిక జానపద గీతం నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కానీ వేటికీ ఆధారాల్లేవు. 
- సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు