మాస్క్‌లకి పెళ్లి కళ

22 Jul, 2021 00:30 IST|Sakshi

కరోనా మూలంగా మాస్క్‌లు రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతున్నారు. వీటిలో ఒకసారి వాడి పడేసేవే ఎక్కువ. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన యూకే వెడ్డింగ్‌ ప్లానర్స్‌ వినూత్న ఆలోచనతో మాస్కులతో మంచి డ్రెస్‌ను డిజైన్‌ చేశారు. వాడి పడేసిన 1500 మాస్కులతో వెడ్డింగ్‌ గౌనును రూపొందించారు. రీ సైకిల్‌ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్‌ డ్రెస్‌ను తయారుచేశారు.

వెడ్డింగ్‌ ప్లానర్‌ వెబ్‌సైట్‌ ‘హిట్చ్‌డ్‌’ (Hitched) ఈ గౌను రూపకల్పనకు పూనుకోగా, డిజైనర్‌ సిల్వర్‌వుడ్‌ గౌనును రూపొందించారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో కేసులు తగ్గి వివిధ కార్యక్రమాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్చ్‌డ్‌ మాస్కులతో సరికొత్త వెడ్డింగ్‌ గౌనును రూపొందించి మోడల్‌కు వేసి ఫోటోలు తీయడంతో ఈ గౌను వెలుగులోకి వచ్చింది.

‘‘ఏటా రూపొందించే వెడ్డింగ్‌ గౌన్‌లకు భిన్నంగా పర్యావరణ హితంగా సరికొత్త గౌన్‌లు తయారు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మాస్కులను ఈ విధంగా కూడా వాడవచ్చని మెస్సేజ్‌ ఇచ్చే ఉద్దేశ్యంతోనే... వాడేసిన మాస్కులను శుభ్రపరిచి వెడ్డింగ్‌ గౌన్‌ను రూపొందించాం. మాస్కులతో వెడ్డింగ్‌ గౌన్‌ మరింత అందంగా వచ్చింది’’అని హిట్చ్‌డ్‌ ఎడిటర్‌ సారా అలార్డ్‌ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు