Bonda Mani: ఆర్థిక కష్టాల్లో కమెడియన్‌ కుటుంబం.. సాయం చేసిన విజయకాంత్‌!

25 Dec, 2023 12:43 IST|Sakshi

సీనియర్‌ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్‌ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు.

వందల సినిమాల్లో నటించి..
అలా సుందర ట్రావెల్స్‌, మరుదమలై, విన్నర్‌, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు.

స్వగృహంలో కన్నుమూత
రోజూ డయాలసిస్‌ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్‌ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

లక్ష సాయం
కమెడియన్‌ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్‌ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్‌ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్‌ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు.

చదవండి: రొమాన్స్‌ సీన్‌లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా

>
మరిన్ని వార్తలు