పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు

16 Nov, 2022 14:28 IST|Sakshi

అభిప్రాయం

పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే కేవలం వారు తలదాచుకోవడానికి గూడు కల్పించడమే కాదు... సమాజంలో సగౌరవంగా తలెత్తుకు బతికే ఆత్మవిశ్వాసాన్ని కూడా కల్పించడమే. అందుకే సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బల హీన వర్గాలకు ఇంటిస్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్నారు. ఫలితంగా 31 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది.

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా... ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. పట్టణాలుగా రూపు దిద్దుకోనున్న 17 వేల ‘జగనన్న కాలనీ’లలో ఇళ్ల ఖరీదు మనం చూస్తుండగానే రెట్టింపు కావడం తథ్యం. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగే సరికి... సమాజంలో గణనీయమైన మార్పును మనం చూస్తాం.

అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్‌ జగనన్న’ కాలనీలు సగర్వంగా తలెత్తుకుని నిలబడతాయి. పేదల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవ సూచీలుగా నిలిచే జగనన్న కాలనీలు... మహిళా సాధికారతకు శాశ్వత చిరునామా కానున్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ప్రభుత్వం ఇవ్వడం ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనం. స్త్రీ ఆలోచనకు అనుగుణంగా నడిస్తే ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడతాయి. బాగుపడ్డ కుటుంబాల సమాహా రంగా జగనన్న కాలనీలు రూపుదిద్దుకోనున్నాయి. 

రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు వైఎస్సార్‌ జగనన్న కాలనీవాసి కానున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటారనుకున్నా.. కోటీ పాతిక లక్షల మంది ఈ కాలనీల్లో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు మందికి ఆవాసం కల్పించే కాలనీలకు సకల సౌకర్యాల కల్పన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పేరుమోసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వెంచర్లలో కూడా కల్పించలేనన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్‌’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞం ఇది.

పేదలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేయడానికి రంగం సిద్ధమవు తున్న తరుణంలో... వాస్తవాలు గ్రహించకుండా, రాజకీయాల కోసం పేదల ఇళ్ల నిర్మాణాన్ని వాడుకోవడం సమంజసం కాదని పవన్‌ కల్యాణ్‌ గ్రహించాలి. ఆత్మ గౌరవంతో జీవించడానికి తొలి అడుగు పడుతున్న సమయంలో పేదల ఆత్మవిశ్వాసాన్ని రాజకీయాల కోసం దెబ్బతీస్తే భవిష్యత్‌ తరం ఆయన్ని క్షమించదు. ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మితమైన ఓ కట్టడంగా మాత్రమే కాకుండా... పేదల జీవితంగా పవన్‌ గుర్తించాలి. నిరుపేదల జీవితాలను రాజకీయం చేయడం వల్ల నష్టపోయేది పేదలే కాదు... పవన్‌ కూడా. నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఆలోచన ఆయ నకు ఉంటే... బడుగుల జీవితాలు బాగుపడుతున్న తీరును అభినందించాలి. పేదల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని వినయంగా మనవి చేస్తున్నా. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణ శ్రీబాగ్‌ ఒప్పందంలోనే ఉంది)


- కైలే అనిల్‌ కుమార్‌ 
ఎమ్మెల్యే; పామర్రు, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు