ద్వంద్వనీతితో రుబాబు

27 Oct, 2021 01:31 IST|Sakshi

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం రంగ రించి మాట్లాడుతుంటారు. ప్రతి మాట లోనూ ఆయన డబుల్‌ టంగ్‌ అంటే రెండు నాలుకల ధోరణి స్పష్టంగా కనిపి స్తుంది. ఆయనకు అది అలవాటైన విధా నమే. తాను ఆర్టికల్‌ 356 ప్రయోగానికి వ్యతిరేకమే గానీ, ఏపీలో మాత్రం జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమలు చేయాలని అంటారు.

ఇదే పనిమీద రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను బందులకు వ్యతిరేకం గానీ, తాము ఇచ్చిన బంద్‌ పిలుపునకు అంతా సహ కరించాలి అంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ రాయడం, రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తిరగడం... చంద్రబాబు ఇలా  చాలా విన్యాసాలు చేశారు. రకరకాల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టానని ఆయన ఫీల్‌ అవుతుండవచ్చు. కానీ సిద్ధాంత దివాళాకోరుతనం, పచ్చి అవకాశవాదం పదే, పదే బయటపెట్టుకుంటున్నానన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. 

ఏపీలో కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకుం టున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణ పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు కొందరిని పట్టుకోవడానికి వచ్చి కాల్పులు జరిపారు. అది ఒక అంశం అయితే దానిపై టీడీపీ మాట్లాడటం తప్పు కాదు. నిజంగానే మాదక ద్రవ్యాలు వ్యాపి స్తుంటే ఆ సంగతి చెప్పడమూ తప్పు కాదు. కానీ పెద్ద ఎత్తున పోలీసులు వాటిని పట్టుకుంటే అభినందించవలసింది పోయి, ఏపీలో గంజాయి పెరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, ఏకంగా వైఎస్‌ జగన్‌కు లింక్‌ పెట్టి ఆరోపణలుచేయడం ద్వారా రాష్ట్ర ఇమేజీని, జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికీ యత్నించారు. 

గంజాయి విషయమై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబును తగు సాక్ష్యాలు ఇవ్వాలని నర్సీపట్నం పోలీసులు కోరారు. ఆయన తన వద్ద ఆధారాలు లేవంటూనే మరుసటి రోజు సమాధానం ఇస్తానని అన్నారట. ఈలోగా టీడీపీ దీనిపై ఒక పథకం వేసినట్లు కనబడుతుంది. ఆ పార్టీ ప్రతినిధిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడగలిగే పట్టాభి అనే వ్యక్తిని ప్రయో గించింది. ఆయన సీఎంను తీవ్రమైన పదజాలంతో దూషిం చారు.

సహజంగానే ఇది వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. కొందరు టీడీపీ ఆఫీస్‌ పైకి వెళ్లి గొడవ చేసి ఉండ వచ్చు. దీనిని సమర్థించజాలం. కానీ ఇన్నేళ్ల అనుభవం ఉన్న బాబు తమ ప్రతి నిధి మాట్లాడింది తప్పు అనాలి కదా. పైగా ఆయన పోరాడు తున్నారని సర్టిఫికెట్‌ ఇవ్వడం దారుణం. అంటే తానే పట్టాభితో అలా మాట్లాడించానని అంగీకరించారన్న మాట. గత కొద్ది రోజులుగా చోటా మోటా నేతలతో బాబు కవ్వింపు విమర్శలు చేయిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలు మాట్లాడకుండా ఇలా డైవర్టు చేస్తున్నారు.

చంద్రబాబు మరో విమర్శ కూడా చేశారు. ఏపీలో స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం ఆసక్తికరం. 1989లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన దీక్ష చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంగవీటి రంగాను టీడీపీకి చెందినవారు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చంద్రబాబుకు తెలిసే జరిగిందని మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.

అద్దాలు పగులగొడితేనే టెర్రరిజం అయితే ఎమ్మెల్యేని హత్య చేయడాన్ని ఏమనాలి? అప్పుడు రంగా అభిమానులు అనండి, కాంగ్రెస్‌ వారు అనండి టీడీపీ వారిని కనిపించిన చోటల్లా కొట్టారు. పార్టీ ఆఫీసులపై దాడులు చేశారు. అప్పుడు ఎన్టీఆర్‌ గానీ, చంద్ర బాబు గానీ తమవాళ్లపై దాడులు చేస్తారా అని దీక్షకు దిగలేదు. రంగా హత్యతో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం ఈ దాడుల కేసులన్నిటిని ప్రతీకార చర్యగా పరిగణించి ఎత్తివేసింది. 

రెండు దశాబ్దాల క్రితం ఆనాటి విపక్ష నేత వైఎస్‌ రాజ శేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని కొందరు టీడీపీ నేతలు హత్య చేశారు. వారికి హైదరాబాద్‌ పార్టీ ఆఫీస్‌లోనే రక్షణ కల్పించారని వార్తలు వచ్చాయి. మరి అది టెర్రరిజం అవుతుందా, కాదా? గత టర్మ్‌లో అనంతపురం జిల్లాలో ఒక ఆఫీస్‌ కార్యాలయంలో పట్టపగలు వైసీపీ నేత ఒకరిని టీడీపీ వారు హత్య చేశారు.  దానిని టెర్రరిజంగా, తన ప్రమేయంతో ఆ హత్యలు జరిగాయని అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా? టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యను అంతా ఖండించారు. టీడీపీ కోరినట్లుగా ఆనాటి సీఎం వైఎస్‌ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.

కానీ ఆ హత్యకు ప్రతీకారంగా టీడీపీ వారు సుమారు 800 బస్సులను దగ్ధం చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టు నుంచే ఈ విధ్వంసానికి పురిగొల్పుతూ ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయని చెబుతారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ ఏజెన్సీలోనే అత్యధికంగా గంజాయి సాగు చేసినట్లు జాతీయ నార్కోటిక్‌ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. దానర్థం చంద్రబాబుకు వాటితో సంబంధం ఉందనా? నర్సీ పట్నం ప్రాంతంలో ఒక టీడీపీ నేతకు గంజాయి వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. 2017లో ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు... దేశం అంత టికి గంజాయి సరఫరా కేంద్రంగా విశాఖ మారిందనీ, చివరికి చిన్నపిల్లల స్కూల్‌ బస్సులను కూడా ఇందుకు వాడుతున్నారనీ చెప్పిన సంగతి చంద్రబాబు మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు మాత్రం ఆయన వర్గం మీడియా ప్రచారం చేస్తోంది.

గంజాయిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసు కుంటుండంతో పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. అందుకు మెచ్చు కోకపోతే పోనీ, ముఖ్యమంత్రికి అంటగట్టి దిక్కుమాలిన రాజ కీయం చేస్తున్నారు. కేవలం తన అధికారాన్ని జగన్‌ గుంజు కున్నారన్న ద్వేషభావమే తప్ప మరొకటి కాదు. అందుకే ఆయన రాష్ట్రపతి పాలన డిమాండ్‌ వరకు వెళుతున్నారు. చంద్రబాబు టైమ్‌లో జరిగిన వనజాక్షి ఘటన, సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరిని కొందరు టీడీపీ నేతలు బెదిరించడం, తిరుపతి అడవులలో ఇరవైమంది కూలీలను ఎన్‌కౌంటర్‌ చేయడం, గోదావరి పుష్కరా లలో 29 మంది మరణించిన ఘటన... ఆయా సందర్భాలను పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు టైమ్‌లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి? ఒకప్పుడు ప్రధాని మోదీని ఉగ్రవాది అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకే లేఖలు రాస్తున్నారు.

తిరుపతి సందర్శనకు వచ్చిన అమిత్‌ షాపై తన కార్యకర్తలతో దాడులు చేయించిన చంద్రబాబు, ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని అదే అమిత్‌ షాకు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని చెప్పి, తమ ఆఫీస్‌పై దాడులను ఖండిస్తున్నామని అని వుంటే చంద్ర బాబుకు ఎంత హుందాగా ఉండేది! దురదృష్టవ శాత్తు ఆయనకు ఆ విజ్ఞత కొరవడింది.

పార్టీ ఉనికి కాపాడుకోవాలన్న ఆదుర్దాలో అన్ని విషయాలలో రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తూ, అధి కారం కోసం ఎంతకైనా దిగజారుతారని రుజువు చేసుకుంటు న్నారు. చంద్రబాబే ప్రకటించినట్లు ఏ కేసులు వచ్చినా తాను చూసుకుంటానని అన్నట్లుగా పట్టాభిని 24 గంటలలో జైలు నుంచి బయటకు తేగలిగారు. ఆయన లాయర్లు అంత సమర్థత కలవారని అనుకోవాలా? కోర్టులలో ఆయన గెలవొచ్చు. ప్రజా క్షేత్రంలో మాత్రం సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారన్నది ఎక్కువమంది అభిప్రాయం.

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
 

>
మరిన్ని వార్తలు