న్యాయమూర్తినీ వదలని వేధింపులు!

20 Dec, 2023 00:23 IST|Sakshi

జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. అసలు దేశవ్యాప్తంగా మహిళలపైన నేరాలు పెరడం చూస్తున్నాం. మహిళలపై అత్యాచారాలకు కారణం – వారి పట్ల భారత సమాజ దృక్పథమే. అయితే, ఒక మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితి వైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల పరిస్థితి ఏమిటి? విచిత్రమేమంటే, సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నాయి. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలు!

‘‘ఏ పౌరుడూ మరొక పౌరుణ్ణి కొన గలిగినంత ధనవంతుడుగా ఉండకూడదు. అలాగని ఏ పౌరుడూ తనను తాను అమ్ముకోవలసినంత పేదవాని గానూ ఉండకూడదు.’’
– రూసో మహాకవి, తాత్విక మేధావి

‘‘తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడం దేశంలో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకొని అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను విచారణకు ఆదేశించారు. ‘‘ఇక నాకు ఏమాత్రం జీవించాలని లేదు. నిర్జీవమైన ఈ శరీరాన్ని మోయడం నిష్ప్రయోజనం. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి అనుమతించండి’’ అని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సుప్రీం చీఫ్‌ను కదిలించి వేసిన ఫలితంగా తక్షణ చర్యలకు ఆదేశించారు.’’
– 16.12.2023 నాటి పత్రికా వార్తలు

ఇలాంటి ‘వేధింపుల పర్వం’ ఇంతకుముందూ జరిగిందని మరచి పోరాదు. నైతికంగా బలహీనుడైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక స్త్రీ అధికారిని రకరకాల వేధింపులకు గురిచేసి, ఆమె లొంగకపోయే సరికి, ఆమెనూ, ఆమె కుటుంబ సభ్యులనూ ఎన్ని రకాల బాధలు పెట్టిందీ లోకం మరచిపోలేదు. అలాంటి నైతిక బలహీనతలు లేనందుననే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉత్తరప్రదేశ్‌ మహిళా న్యాయమూర్తి పట్ల జరిగిన వేధింపుల కేసుపై తక్షణ విచారణకు ఆదేశించారు. 

గవర్నర్ల తీరు
ఇదిలా ఉంచి, బీజేపీ–ఆరెస్సెస్‌ నాయకత్వ పాలన ఎలా ఉందో చూడండి: వారి విధానాలను అడ్డుకునే లేదా విమర్శించే రాష్ట్ర ప్రభుత్వాలను అదుపులో ఉంచగల తమ పార్టీ గవర్నర్లకు మాత్రమే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడే అధికారాలు అప్పగించారు.

ఇందుకు పక్కా ఉదాహరణలు – కేరళ, తమిళనాడు గవర్నర్లు తీసు కుంటున్న నిర్ణయాలు! రాజ్యాంగంలోని 200 అధికరణకు ఇచ్చిన తొలి వివరణ ప్రకారం, శాసనసభ చర్చలో ఉన్న బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో శాసనసభ నిర్ణయం. అంతేగానీ ఆ హక్కు గవర్నర్‌కు లేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నర్లు తమ అసాధారణ అధికారాలు చెలాయిస్తూ శాసనసభ బిల్లులను తొక్కి పెడుతున్నారు.

కానీ, బిల్లును ఆమోదించగల లేదా తిరస్కరించగల అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు లేకుండా చేసే పెత్తనం గవర్నర్‌కు లేదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా బిల్లును ఆమోదించ నిరాకరించే పక్షంలో ‘తిరిగి పరిశీలించండి’ అన్న విజ్ఞప్తితో శాసన సభకు నివేదించాలేగానీ, బిల్లులను తొక్కిపెట్టే అధికారం మాత్రం గవర్నర్‌కు లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  కరాఖండీగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ అధికారం ప్రజలు ఎన్నుకొనని గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ప్రసిద్ధులకే ఇలా ఉంటే...
అంతేగాదు, పంజాబ్‌ శాసనసభ కేసులో సుప్రీంకోర్టు బిల్లులను తొక్కిపెట్టి ఉంచే అధికారం గవర్నర్లకు లేదని స్పష్టం చేయడంతో రాజ్యాంగంలోని 200 అధికరణకు ఆచరణలో విలువ పెరిగింది. ఇదే సూత్రం రాష్ట్రపతికీ వర్తిస్తుంది. లోక్‌ సభ మాజీ ప్రధాన కార్యదర్శి పి.డి.టి. ఆచారి చెప్పినట్టు, ఒక చట్టం రాజ్యాంగబద్ధత సరైనదా, కాదా అన్నది కోర్టు నిర్ణయించాల్సిందే గానీ, ఆ విషయంపై ఇటు రాష్ట్రపతికీ, అటు గవర్నర్లకూ ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అయితేనేమి, పాలకులు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు నటించ డమేగానీ దాని విలువలను ఆచరణలో పాటించడంలో నడుపుకొనేవి ‘సొంత దుకాణాలే’నని మరవరాదు. 

ఈ పరిస్థితులలో ఒక్క మహిళా న్యాయమూర్తులపైననే కాదు, అసలు దేశ మహిళలపైననే నేరాల సంఖ్య పెరిగిపోవడం చూస్తున్నాం. 2022వ సంవత్సరానికి నేషనల్‌ క్రైమ్స్‌ బ్యూరో ప్రకటించిన వివరాలను బట్టి మహిళలపైన ఇంతకుముందు కంటే నేరాల సంఖ్య పెరిగిపోయింది. పైగా, పెక్కు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పక్కన తమ మగ బంధువుల తోడు లేకుండా తాముగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకోలేని స్థితి. మహిళలపై నేరాల సంఖ్య 4 శాతంపైన పెరిగిందని క్రైమ్స్‌ బ్యూరో నివేదిక. ఇవిగాక భర్తలు, వారి బంధువులు చేసిన నేరాల సంఖ్య 2022లో 4.45 లక్షలు. అంటే, ప్రతి గంటకూ 51 కేసులు రికార్డ య్యాయి. 

మరీ విచిత్రమేమంటే, ‘సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నా’యని జాతీయ మహిళా సంస్థ ‘జాగోరి’ డైరెక్టర్‌ జయశ్రీ వేలంకర్‌ వివరించారు. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలని ఆమె అన్నారు.

మహిళల రక్షణకు ఉద్దేశించిన కఠిన చర్యలు కాగితం మీదనే ఉండి పోయాయిగానీ ఆచరణలో లేవనీ, దీన్ని బట్టి సంప్రదాయంగా స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతూ ఉండటానికి అసలు కారణం – స్త్రీల పట్ల భారత సమాజ దృక్పథమేననీ సుప్రీంకోర్టు ప్రసిద్ధ మహిళా న్యాయ వాది శిల్పి జైన్‌ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్‌ మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితివైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల విషయంలో గణింపు నకు రాని, వచ్చినా పట్టించుకోని సమాజ స్థితిగతుల్ని అర్థం చేసు కోగలగాలి. 

మాంస వ్యాపారం
నా మిత్రుడు, సుప్రసిద్ధ లాయర్‌ హనుమారెడ్డి మతాలు – చట్టాల గురించి ముచ్చటిస్తూ మరవరాని రెండు మంచి మాటలు చెప్పాడు: ‘‘మతాలు రాజ్యమేలినప్పుడు చట్టం ఒక పద్ధతిగానూ, రాచరికం రాజ్యమేలినప్పుడు చట్టం మరొక పద్ధతిలోనూ, వ్యాపారం రాజ్యమేలినప్పుడు వేరొక పద్ధతిలోనూ ఉండి ప్రజలకు సంబంధించిన విధివిధానాలు మారుతూ వచ్చాయి. స్థూలంగా చెప్పాలంటే నేరాలు రెండు విధాలుగా ఉండాలి. ఒకటి రాజ్యాధికారం పట్ల నేరం, రెండవది ప్రజలపట్ల నేరం.’’ 

అలాగే, ‘ప్రేమ’ అనే పేరిట ఎంత ప్రమాదకర పరిణామాలు, విధ్వంసం జరుగుతున్నాయో మందరపు హైమవతి తన ‘నీలి గోరింట’ కవితలో ఇలా చీల్చి చెండాడవలసి వచ్చింది:

‘‘తండ్రీ, కూతురు, గురువు, శిష్యురాలు
వావివరసల్లేకుండా
ఆడపిల్లలే అంగడి సరుకులైనప్పుడు
మానవ మాంస వ్యాపారంలో
మహిళల శరీరాలే పెట్టుబడి ఐనప్పుడు
రుష్యశృంగుడైనా మేనకను చూచిన
విశ్వామిత్రునిలా మారిపోడా?!’’

అలా మారిపోకూడదనే ఉత్తరప్రదేశ్‌ మహిళా న్యాయమూర్తికి జరిగిన సంఘటన నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదేపదే చేస్తున్న విజ్ఞప్తుల పరంపర లక్ష్యం!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

>
మరిన్ని వార్తలు