... కానివాళ్లకు కంచాల్లోనా?

6 Apr, 2022 00:46 IST|Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన ఒక దినపత్రిక యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ అవకాశం వస్తుందా అని కాచుకుని కూర్చున్నట్లుగా వార్తలతో పాటు సంపాదకీయాలూ రాస్తున్నారు. నిజంగానే పత్రికకు చిత్తశుద్ధి ఉంటే ఎడిటోరియల్‌ రాయడం అభ్యంతరకరం కాదు. కానీ రాసిన తీరు చదివితే జగన్‌ పట్ల ఉన్న ద్వేషం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైనవీ, నిబంధనలకు వ్యతిరేకమైనవీ ఉంటే వాటిని పత్రికలు రాస్తే తప్పుకాదు. అలా కాకుండా తాము కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడానికి జనం ముందుకు రారేమిటి? అన్న ఆక్రోశంతో రాయడంలో మాత్రం కచ్చితంగా సమాజాన్ని భ్రష్టు పట్టించే తాపత్రయమే తప్ప మరొకటి కనపడదు.

తాజాగా ఈనాడు పత్రికలో ‘అయ్యాఎస్‌’ అన్న శీర్షికన రాసిన ఎడిటోరియల్లో ముఖ్య మంత్రి జగన్‌పై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కారు. కొందరు ఐఏఎస్‌ లకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ పత్రిక ఈ ఎడిటోరియల్‌ రాసింది. పత్రికలు ప్రమాణాలు పాటించాలని నీతులు చెప్పే రామోజీ తాను మాత్రం వాటన్నిటికీ అతీతుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తెల్లవారేసరికల్లా ఎడిటోరియల్‌ రాసేశారు. అందులో ఏపీలోని ఐఏఎస్‌లను దుయ్య బట్టారే కానీ, మిగిలిన ఏ రాష్ట్రంలో అధికారుల గురించీ ప్రస్తావించక పోవడం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

అంతదాకా ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో చీఫ్‌ సెక్రటరీపై ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి? తెలంగాణకు చెందిన ఎందరు ఐఏఎస్‌లకు హైకోర్టు శిక్షలు వేసిందీ? వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందీ! ఆర్టీసీ సమ్మె సమయంలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందీ? అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెనక్కి తగ్గలేదే. మరి వీటన్నిటి గురించి కూడా రాసి ఉంటే ఆ సంపా దకీయాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారే దేశ వ్యాప్తంగా 3,464 మంది ఐఏఎస్‌లపై ఫిర్యాదులు వచ్చాయనీ, 44 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసిందనీ రాశారు. మరి అలాంటప్పుడు ఆయా రాష్ట్రాలలోని కొన్ని కేసులనైనా రిఫర్‌ చేయాలి కదా. మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి ఇంటి నుంచి కోట్ల రూపాయల నగదు పట్టు బడింది. దాని గురించి ‘ఈనాడు’కు తెలియదనుకోవాలి. 

అధికారులనే కాదు... జగన్‌పై కూడా అవాకులు, చవాకులు రాశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకూ, పాలకుల అధికారాలకూ రాజ్యాంగం విధించిన పరిమితులంటే జగన్‌కు ఏహ్య భావమట! ఆయన ఏలుబడిలో అధికారులకు కూడా ఆ అవలక్షణం అలవడిం దట. జగన్‌కు ఏహ్య భావమేమో కానీ, రామోజీకి ఉన్న ఏహ్య భావాన్ని దాచుకోలేకపోయారని అర్థం చేసుకోవచ్చు. మూడు రాజ ధానులపై వచ్చిన తీర్పుపై ఏపీ శాసన సభ సమగ్రంగా సమీక్షించి తీర్పులోని లోటుపాట్లను బహిరంగ పరచడం బహుశా ఈ పత్రికకు నచ్చి ఉండదు. మూడు రాజధానులపై తీర్పు వచ్చిన వెంటనే రామోజీ ఒక ఎడిటోరియల్‌ రాసి జగన్‌పై ఉన్న అక్కసును వెళ్ల గక్కారు. అయినా జగన్‌ ముందుకు వెళ్తానని ప్రకటించడంతో దానిని మనసులో పెట్టుకుని ఇలాంటి సంపాదకీయాలూ, వార్తా కథనాలూ రాస్తున్నట్లుగా ఉంది.

ఏపీలోని కొన్నిచోట్ల స్కూళ్ల ప్రాంగణాలలో గ్రామ సచివాల యాలు ఏర్పాటు చేశారన్నది అభియోగం. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు ఇచ్చింది. దానిని చాలావరకు అధికారులు అమలు చేశారు. అయినా ఆలస్యంగా అమలు చేసినందుకు జైలు శిక్షలు వేస్తున్నానని చెప్పి, తదుపరి... దానికి బదులుగా హాస్టళ్లలో నెలకు ఒక రోజు సేవ చేయాలని ఆదేశించారు. ఈ మాత్రానికే అదేదో కొంప మునిగిపోయినట్లు ‘ఈనాడు’ రాసింది. పనిలో పని ఏపీలో విద్యా వ్యవస్థపై కూడా తన ఆక్షేపణలు తెలియ చేసింది. కొద్ది రోజుల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీలో జాతీయ విద్యా విధానం బాగా అమలవుతోందని ప్రశంసిస్తే, ‘ఈనాడు’కు మాత్రం దానిని తుంగలో తొక్కినట్లు కనిపిస్తుంది. నిజానికి ఏపీలో విద్యా రంగం అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ‘నాడు–నేడు’ కింద  స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తయారు చేసిన తీరుపై ఎన్నడైనా ఈ పత్రిక మంచి వార్త ఇచ్చిందా? ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పెడితే ఇదే పత్రిక గగ్గోలుగా వార్తలు రాసింది. అదే పద్ధతిని తెలంగాణలో కూడా తీసుకువస్తే ఎందుకు వ్యతిరేక కథనాలు ఇవ్వలేదు? 

ఏపీలో తీసుకువచ్చిన సంస్కరణలు ‘ఈనాడు’కు కనిపించడం లేదా? గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఎన్నడైనా ప్రస్తావించారా? కొత్త జిల్లాల ఏర్పాటు సంద ర్భంగా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగా ఆయన నియోజకవర్గమైన కుప్పంలో కూడా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారే. అయినా రామోజీకి అవేమీ కనిపించలేదు. మరో విషయం చూడండి. జగన్‌కు అధికారం దఖలు పడగానే, అయ్యవారి దర్శనానికి బారులు తీరిన ఉన్నతాధికారులలో బోలెడు మంది జగన్‌ను పరిపాలన దక్షుడనీ, ప్రగతి కాముకుడనీ నోరారా కీర్తించి నట్లు కథనాలు వచ్చాయట. ఎవరు ముఖ్యమంత్రి అయినా అధికా రులు వారికి దగ్గరగానే ఉంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఆయనతో సన్నిహితంగా లేరా? ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక ఐఏఎస్‌ అధికారి ఏకంగా హెరిటేజ్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యారే. ఇది గొప్ప విషయంగా రామోజీకి కనిపించిందా? అధికారులు ఆయా ఫైళ్లను పరిశీలించేటప్పడు తమ అభిప్రాయాలను నిష్కర్షగా రాయాలి.

అది వారి బాధ్యత. రామోజీకి ఎంతో గొప్పగా కనిపించే అమరావతి భూముల విషయమై ఆనాటి చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన అభ్యంత రాలను చంద్రబాబు ఖాతరు చేయకపోయినా ఆ ప్రభుత్వం గొప్పది అని రామోజీ భావన కావచ్చు. ‘నాకిది–నీకిది’ అని ప్రభువుల మోచేతి నీళ్లు తాగుతున్నారట. ఇంత నిష్కర్షగా చెప్పే పెద్ద మనిషి ఐఏఎస్‌లను రోజూ పిలిపించుకుని తన పెంట్‌ హౌస్‌లో ఎందుకు విందులు ఇచ్చేవారో కూడా వివరిస్తే ఇంకా బాగుండేది కదా. ఐఏఎస్‌లు అయినా, ప్రభుత్వంలోని వారైనా ఎవరు అవినీతికి పాల్పడినా సహించనక్కర్లేదు. మరి ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు రామోజీకి ఈ ఆవేశం ఏమైపోయింది? ఒక సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఇరవై మూడు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే లావాదేవీలో పాల్గొంటే అది ప్రజాక్షేమం! ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలలో మమేకమై చివరికి ‘తెలుగు యువత’ వంటి పదవు లకు సైతం ఎంపికయిన పోలీసు అధికారులు అత్యంత సమర్థులూ, నిష్పక్షపాతంగా పనిచేసినట్లూ!

కడప జిల్లాలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన ఒకాయనకు, మరో నేతకు మధ్య అధికారులతో రాజీ చేయించి, వాటాను ఎలా పంచుకోవాలో చెప్పిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు గొప్ప వారు! అలా వాటాలు పంచిన అధికారులు పాలనలో సమర్థులన్న మాట! తన ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే ముఖ్యమంత్రి అయితే పాలనాదక్షుడు అవుతారని ఆ పత్రికాధినేత భావనేమో తెలియదు. ఐఏఎస్‌ల గురించి చాలా రాశారు కదా... తన మీడియా రిపోర్టర్ల ద్వారా ఇదే ఐఏఎస్‌ల వద్దకు ఎందుకు పైరవీలకు పంపించారో గుర్తు చేసుకుంటే వాస్తవం ఏమిటో బోధపడుతుంది కదా. మరొకాయన అయితే మంత్రులు, ఐఏఎస్‌ చాంబర్లలోనే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ చాంబర్‌లో కూర్చుని కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టుల పైరవీలు చేసినప్పుడు ఐఏఎస్‌లు మంచివారన్నమాట.

ఇలా పాత్రికేయుల ముసుగులో దందాలు చేసిన వారు నీతులు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట! ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే అధికారులు పనిచేయవలసి ఉంటుంది. ఏమైనా రాజ్యాంగ విరుద్ధమైనవీ, నిబంధనలకు వ్యతిరేక మైనవీ ఉంటే వాటిని అధికారులు ఒప్పుకోరాదన్నంత వరకూ పత్రి కలు రాస్తే తప్పుకాదు. అలా కాకుండా ఈ అధికారులు ఎవరూ జగన్‌పై తిరుగుబాటు చేయరేమిటి? తాము కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడానికి జనం ముందుకు రారేమిటి? అన్న ఆక్రో శంతో రాయడం మాత్రం కచ్చితంగా సమాజాన్ని భ్రష్టు పట్టించా లన్న తాపత్రయమే తప్ప మరొకటి కనపడదు. ఈ సందర్భంగా జగన్‌ ఏపీ శాసనసభలో ప్రస్తావించినట్లుగానే మరికొన్ని మీడియా సంస్థ లతో పాటు ‘ఈనాడు’ పత్రికా, రామోజీ రావూ టీడీపీని మోయడానికే కంకణం కట్టుకున్నట్లుగా ఉందన్న సంగతి నగ్నంగా కనిపిస్తోంది.

కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు