Gunturu Seshendra Sharma: రసాత్మక వాక్యాల విప్లవ కవి

30 May, 2021 09:56 IST|Sakshi

మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ అఖిల భారత స్థాయిలో గుర్తింపు పొందాల్సినంత ప్రతిభాశాలి. ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని అనుకునేవాళ్లలో నేనొకడిని. భారతదేశపు నోబెల్‌ ప్రైజుగా భావించే జ్ఞానపీఠ పురస్కారం ఆయనకు వచ్చినట్టే వచ్చి చేజారడం దురదృష్టకర సంఘటన.

శేషేంద్ర సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ తనదైన ముద్రను లిఖించగలిగాడు. ఆశ్చర్యం యేమిటంటే, ఆయనను కవిగాకంటే విమర్శకుడిగా గుర్తించటం. ఈమాట ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆయన రాసిన ఏ కవితా సంకలనానికో రాలేదు. కాలరేఖ పేరుతో ఆయన సంకలనం చేసిన కొన్ని విమర్శా వ్యాసాలకు వచ్చింది. మరొక ఆశ్చర్యకరమైన అంశమేమంటే, ఆయన శ్రామిక పక్షం వహిస్తూ శ్రామిక విప్లవం రావాలని చెప్పే కవిత లెన్నో రాశాడు. అయినప్పటికీ ఆయనను అభ్యుదయకవి అనో, విప్లవ కవి అనో ఎవరూ అనలేదు. ధనిక వర్గానికి చెందిన నవ్య సంప్రదాయవాదిగానే తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించింది.

ఇందుకు కారణం ఏమిటో మనం పెద్దగా ఊహిం చాల్సిన అవసరం లేదు. మహాసంపన్నురాలైన ఇందిరా ధన్‌రాజ్‌గిరితో ఆయన సహజీవనం చెయ్యటం మొదలెట్టినప్పటినుంచీ ఆయన జీవన విధానం మారిపోయింది. రాజభవనం లాంటి ప్యాలెస్‌లో నివసిస్తూ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన శేషేంద్రను విప్లవ కవి అంటే ఎవరు నమ్ముతారు?

కానీ ఆయన కవిత్వంలో మాత్రం బలమైన విప్లవ భావాల చిత్రణే జరిగింది. ఇందుకు ఉదాహరణగా ఆయన రాసిన ‘గొర్రిల్లా’ అనే లఘుకావ్యాన్ని పరిశీలించవచ్చు. ఆయన ప్రతి కవితలోని ప్రతీ వాక్యం సౌందర్యవంతంగా, రసాత్మకంగా ఉంటుంది. ‘లేస్తోంది ఉషఃకాంతుల్లోంచి ఒక హస్తం/ ఆ హస్తం, కాలం అనే నిరంతర శ్రామికుడి సమస్తం’ అని అన్నా, ‘నదులు, కవులు ఖగోళపు రక్తనాళాలు’ అన్నా ఎంత రసాత్మకంగా ఉన్నాయో గమనించవచ్చు.

గెరిల్లా అనే ఇంగ్లిష్‌ మాటను ఆయన గొర్రిల్లా అంటున్నాడు. దీన్ని విప్లవానికి సంకేతంగా ఈ కవి తీసుకున్నాడు. శ్రామిక విప్లవం కోసం గెరిల్లా అనే వాడు కంటికి కనిపించకుండా శత్రువుపై మెరుపుదాడి చేస్తాడు. డెబ్బైలలో వియత్నాంలో గెరిల్లాలు గొప్ప పోరాటం చేశారు. అమెరికా లాంటి శక్తిమంతమైన పెట్టుబడిదారి సైన్యాన్ని కోలుకోకుండా దెబ్బతీశారు. వీరిని వియట్‌కాంగ్‌ అనేవారు. అలాంటి గెరిల్లాలే ప్రపంచంలో సమసమాజాన్ని స్థాపించగల్గుతారని ఈ కావ్యంలో శేషేంద్ర భావించాడు.

‘అడవుల్లో ఉరితీసిన వీరుడిలా ఉదయపు చెట్లలో వ్రేలాడుతున్నాడు సూర్యుడు’ అంటాడు. ‘దేవత  లొస్తుంటారు, పోతుంటారు. మనకందే దేవత మాత్రం మన చేతుల్లో ఉన్న నాగలి... మన కండరాల్లో నిదురించే గొర్రిల్లా’ అన్నప్పుడు గెరిల్లాను రాబోయే విప్లవానికి ఒక ప్రతీకగా భావించాడు. శేషేంద్ర కవి త్వంలో అడుగడుగునా ఈ సింబాలిజం దర్శన మిస్తుంది. ఇంకా తనలోని గెరిల్లా గురించి ఈ కవి అంటున్న ఈ మాటలు చూడండి:

సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు/ తుపాను గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు/ నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు– కానీ/ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’.

‘రా సోదరా, ఇది గొర్రిల్లా యుగం. విస్తట్లో తుపానులు వడ్డించాను, తిందామురా. మనకోసం నిరీక్షిస్తున్న తరుణపు బ్రహ్మరాక్షస పరిమాణాలు అందుకుందాం రా’ అని పాఠకులను పిలుస్తాడు. ‘తమ్ముడా నీ గాయాల దైన్యాన్ని చూడలేకున్నాను. కానీ నీ ఆత్మ తిరగబడదనే నా బాధ! లోకం గొర్రిల్లా దశలోకి దొర్లిపోతోంది. మన మహాపూర్వుడి ఇనుప కండరాల శకంలోకి– ఇంకా పాత పేజీల్లోనే పచార్లు చేస్తూ ఉండిపోకు’అని హెచ్చరిస్తాడు.

ఇంకా ఇలా అంటాడు: ‘పొగరుబోతు గుర్రాల్లా నురగలు కక్కుతూ పరుగులెత్తే కండరాలకు కళ్లెం వెయ్యకు. నీ బాహువుల్లో నిదురించే శక్తే నిన్ను రక్షించాలి. వాళ్ల దేవుడు గుడి విడిచి పారిపోయాడు, భక్తుల బాధ తట్టుకోలేక. నీ దేవుడు నీ తుపాకీ కండరాల్లోనే నిదురిస్తున్నాడు. అది పేలిన శబ్దం నీ చుట్టూ సుడి తిరిగితే, ఒక గుడిగా పెరిగితే నీ యుగం దిగి వస్తుంది భూతలం మీదికి’.

గెరిల్లా ఇలా అంటున్నట్టుగా ఈ కవి ఊహిం చాడు: ‘నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు. పిడికిళ్లలో బాంబులు బిగించుకొని వచ్చాను’.

శేషేంద్రకు ప్రతీకాత్మక లేక సింబాలిస్టు పొయెట్రీ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ‘నీరై పారి పోయింది’ కావ్యాన్ని గూర్చి రాస్తూ ఆర్‌.ఎస్‌. సుదర్శనం ఇలా అంటారు: ‘‘ఈ కావ్యంలో కవితాభివ్యక్తి ప్రతీకల ద్వారా జరుగుతున్నది. ఆ పద్ధతి అంటే తనకెంత అభిమానమో ‘రక్తరేఖ’లో శేషేంద్ర శర్మ చాలా చోట్ల రాశాడు. ఆలంకారికులు సాహిత్య పరాకాష్ఠగా చెప్పే ధ్వని కంటే సింబాలిజం చాలా గొప్పది. అది ఒక విరాట్‌ స్వరూపం. అయితే ధ్వని దాని పాదం వరకే వస్తుంది. ధ్వని కేవలం ఒక శబ్ద శక్తి వ్యవహారం. కానీ సింబాలిజం ఒక దృగ్‌వ్యవహారం, సదసద్వివేక వ్యవహారం, వైదిక వ్యవహారం’.

శేషేంద్ర రాసిన అన్ని కావ్యాల్లోలాగే ఈ కావ్యంలో కూడా ప్రతీకాత్మకత ప్రధానంగా దర్శన మిస్తుంది. గెరిల్లాను ఇంతగా హృదయంలోకి తీసుకొని, తన పితామహునిగా భావించి ఆకాశానికి ఎత్తేస్తూ రాసిన ఈ లఘుకావ్యంలోని విప్లవకాంక్షను విప్లవకవులు లేక విప్లవాభిమానులు గుర్తించారో లేదోగానీ అడుగడుగునా వాక్యం రసాత్మకం అనిపించే ఈ కావ్యాన్ని రచించిన శేషేంద్ర శర్మను మహాకవి అనటానికి ఎవరికీ సందేహం ఉండకూడదనుకుం టాను. ఆ మహాకవికి నా జోహార్లు!


- అంపశయ్య నవీన్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత
(మే 30న గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి)

మరిన్ని వార్తలు