లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్‌ కుమార్తె

28 Oct, 2023 13:28 IST|Sakshi

వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు.

ఏ.ఆర్‌. రెహమాన్‌ కుమార్తె ఖతిజా రెహమాన్‌ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్‌ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక.

‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్‌ స్టుడియోలో, స్టేజ్‌ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్‌ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్‌ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్‌ఫామ్‌ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 

26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్‌ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్‌ మహిళా మంత్రి రీమ్‌ అల్‌ హష్మి  ఏ.ఆర్‌.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్‌ ‘ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్‌ కూడా చేస్తున్నారు. పొన్నియన్‌ సెల్వమ్‌ 2’ రీ రికార్డింగ్‌ ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు.

అరెబిక్‌ సౌందర్యం
ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల  మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్‌ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్‌ థియేటర్‌లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్‌మెన్‌ అనే మహిళ పని చేస్తోంది.

లతాకు నివాళి
తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్‌. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె.  గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్‌ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 
1. పియా తోసే నైనా లాగేరే (గైడ్‌), 
2.ఆప్‌ కీ నజరోనే సంఝా (అన్‌పడ్‌), 
3. ఓ సజ్‌నా బర్‌ఖా బహార్‌ ఆయీ (పరఖ్‌), 
4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 
5. బేకస్‌ పె కరమ్‌ కీజియే (మొఘల్‌ ఏ ఆజమ్‌). ఈ ఐదు పాటలకు ఫిర్‌దౌస్‌ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్‌లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్‌దౌస్‌ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది.  

మరిన్ని వార్తలు