International Widows Day: వితంతువులను గౌరవిద్దాం... 

23 Jun, 2021 09:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు (జూన్‌ 23) అంతర్జాతీయ వితంతు వివక్షా విముక్తి దినం సందర్భంగా

ప్రపంచ వ్యాప్తంగా వితంతువులు ఏదో ఒక రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ బహిష్కరణ, గృహ హింస, వివక్షత, మూఢాచారాలు, పేదరికం లాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని బతుకుబండి లాగుతున్నారు. అనునిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వితంతువులకు అండగా ఉంటూ ఆదరణ చూపించడానికై ఐక్యరాజ్య సమితి 2011 జూన్‌ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఏర్పాటుచేసి వితంతు వివక్ష విముక్తి కోసం పోరాడాలని పిలుపు ఇచ్చింది. 

గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో వితంతు విముక్తి ఉద్యమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ముమ్మరంగా నడుపుతున్న బాల వికాస సామాజిక సేవా సంస్థ, వరంగల్‌ వారు ప్రపంచ చరిత్రలోనే 10,000 మంది వితంతువులతో అతి పెద్ద మహాసభను 2018 జూన్‌ 23న హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేశాము. ఈ సభకు వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మత పెద్దలు వితంతు వివక్ష అనేది ఏ మతంలోనూ ప్రోత్సహించరని, జరుగుతున్న తంతు అంతా కూడా ఒక సామాజిక మూఢ నమ్మకం, మూఢాచారం మాత్రమే అని చాటి చెప్పారు. 

భారదేశంలో సుమారు నాలుగున్నర కోట్ల వితంతువులు ఆధరణ నోచుకోకుండ, ఆత్మాభిమానం కోల్పోయి జీవిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో అనేక మంది వితంతువులు అనేక పరిస్థితులలో భయంకర వివక్షతను అనుభవిస్తున్నారు. పండుగల్లో, కుటుంబ శుభకార్యాలలో వివక్షత. కనీసం కన్నబిడ్డ వివాహాల్లో మనస్పుర్తిగా ఆశీర్వదించలేని అభాగ్యురాలిగా, సాటి మహిళలలాగా సాధారణ బట్టలు వేసుకోలేక, పురుషులలాగా రెండో పెళ్ళి చేసుకోలేక, ముఖ్యంగా యువ వితంతువులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వితంతువులు సాటి మహిళతో సమానత్వం కావాలనీ, కనీసం తనను మనిషిలా చూడాలని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. ప్రభుత్వాలతోపాటు, సమాజంలోని అందరు వితంతువులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే ప్రజల ఆలోచనలు మారి, ఆచరణలో మార్పు వచ్చినప్పుడు సమాజం మార్పు చెందుతుంది. ఈ వితంతు వివక్షా విముక్తి ఉద్యమంలో భాగస్వాములై మన అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఆత్మగౌరవంగా జీవించే హక్కు కల్పిద్దాం.

– సింగారెడ్డి శౌరిరెడ్డి
బాల వికాస ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
మొబైల్‌: 98491 65890

మరిన్ని వార్తలు