‘సహకార’ వ్యూహం ఫలించేనా?

16 Jul, 2021 01:05 IST|Sakshi

విశ్లేషణ

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు, నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. భారత్‌లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక పాలనా, న్యాయశాసన, విధానపరమైన చట్రాన్ని ఈ కొత్త శాఖ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక రోజు తర్వాత ఈ నూతన మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. విడివిడిగానే అయినప్పటికీ కలిసే వచ్చిన ఈ రెండు ప్రకటనలపై పరిశీలకులు అంచనాలు మొదలెట్టేశారు. వాస్తవానికి కో-ఆపరేటివ్‌లు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దేశం లోని ప్రతి రాష్ట్రం కో-ఆపరేటివ్‌లకు రిజిస్ట్రార్‌ని నియమిస్తుంది. ఈ రంగాన్ని మొత్తంగా ఆ రిజిస్ట్రారే పర్యవేక్షిస్తుంటారు. పైగా, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా కో-ఆపరేటివ్‌ బ్యాంకులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇంత పటిష్ట నిర్మాణం ఉంటూండగా, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఎందుకు సృష్టించినట్లు? పైగా ఈ శాఖను అమిత్‌ షా చేతిలో పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర రంగాలకు మల్లే సహకార సంస్థలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. అవి సామాన్యంగా పతాక శీర్షికలకు ఎక్కవు. కానీ గ్రామీణ భారత్‌ని, క్రమబద్ధీకరణ లేని ఆర్థిక వ్యవస్థను బలపర్చే ఆర్థికపరమైన చట్రంలో ఇవి భాగం. ఉత్పత్తి (చక్కెర), పరపతి (పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్‌లు, సహకార బ్యాంకులు), మార్కెటింగ్‌ (పాల కో-ఆపరేటివ్‌లు) వంటి వాటిలో వీటి ఉనికిని మనం చూడవచ్చు.

పాత వైపరీత్యం దిద్దుబాటే లక్ష్యమా?
చాలాకాలంగా కొనసాగుతున్న ఒక నియమ విరుద్ధమైన వైపరీత్యాన్ని చక్కదిద్దడానికే కేంద్రం ఈ పనికి పూనుకుందని భావిస్తున్నారు. కో–ఆపరేటివ్‌లు నిజానికి రాష్ట్ర పరిధిలోనివే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై ఒక కన్నేసి ఉంచుతూ వస్తోంది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సహకార సంస్థల పర్యవేక్షణ విభాగం ఉంటోంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నప్పటికీ, కో–ఆపరేటివ్‌ల అవసరాల పట్ల ఈ శాఖ పెద్దగా స్పందించదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. కాలానుగుణంగా కోఆపరేటివ్‌లు మారుతూవచ్చాయి. కొత్తగా సహకార రంగంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉండటం లేదు. ఇప్పుడవి గృహనిర్మాణం, కార్మిక రంగాలలో ప్రవేశిస్తున్నాయి. ఈ కారణాలవల్ల సహకార సంస్థలను కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఏమంత అర్థవంతమైన చర్య కాదు అని ఆ అధికారి చెప్పారు. అయితే మోదీ నిర్ణయం ప్రకారం అమిత్‌ షా ఈ కొత్త శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. కో-ఆపరేటివ్‌లు అభివృద్ధికి ఉపకరణాలుగా ఉపయోగపడేవి కాబట్టి రాజకీయ లక్ష్యాలు తెరమీదికి వస్తుండేవి.

సహకార సంస్థలు... రాజకీయాల ప్రాబల్యం
నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకొచ్చిన గుజరాత్‌ నమూనాకు సంబంధించిన కీలకమైన అంశాల్లో కో-ఆపరేటివ్‌లపై బీజేపీ నియంత్రణ ఒకటనే విషయం ఎవరికీ పెద్దగా తెలీదు. 1990లలో బీజేపీ... గుజరాత్‌లో రుణపరపతి సహకార సంస్థలపై నియంత్రణను ఏర్పర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అమూల్‌ జిల్లా పాల యూనియన్లపై పట్టు సాధించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, స్థానిక అధికార వ్యవస్థలను బలహీనపర్చి వాటిని తొలగించడమే దీని ఉద్దేశం. దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే... ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్‌లో పాల సహకార వ్యవస్థ చాలా పెద్దది. గుజరాత్‌లోని 17 వేల గ్రామాల్లో 16,500 గ్రామాలు డెయిరీల పరిధిలో ఉంటున్నాయి.

అందుకే 2001లో మోదీ గుజరాత్‌ సీఎం అయ్యాక సహకార సంస్థలను కైవసం చేసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. కో-ఆపరేటివ్‌ల యాజమాన్యాలపై కేసులు పెట్టి వారు బీజేపీలో చేరకతప్పని పరిస్థితి కల్పించారు. 2017 నాటికి కో-ఆపరేటివ్‌లను పూర్తిగా కైవసం చేసుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతుల్లో ఒక్క కోఆపరేటివ్‌ సంస్థ కూడా లేకుండా పోయింది. మొత్తం మీద చూస్తే రాజకీయ లాభం కోసం కో-ఆపరేటివ్‌లను ఉపయోగించుకోవడం గుజరాత్‌లో స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయనేతలు అతిగా ఖర్చుపెట్టడం, పలు కాంట్రాక్టుల ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుకావడంతో డెయిరీ ఆర్థికవ్యవస్థలు క్షీణించిపోయాయి. సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖపై మరో రెండు కొత్త ఊహలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

యూపీలో గ్రామీణ అసంతృప్తిని చల్లార్చడం ఎలా?
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ముందు రైతులను శాంతపర్చడానికి కేంద్రం చేస్తున్న తీవ్రప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్దనోట్ల రద్దు వంటి భారీ పథకాన్ని ప్రకటించడానికి బీజేపీ ఏదోలా జోక్యం చేసుకోవడం తప్పేటట్టు లేదు. ప్రైవేట్‌ కంపెనీలే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనేస్తాయనే భయాందోళనలనుంచి రైతులను బయటపడేయడానికి పెద్ద ఎత్తున సహకార సంస్థలను రంగంలోకి దింపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికలకు ముందుగా భారీ పథకం ప్రకటించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుండా చేయవచ్చని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరొక ఊహాకల్పన ఏమిటంటే గుజరాత్‌లో మోదీ, షా ట్రాక్‌ రికార్డుపై ఎక్కువగా ఆధారపడుతూ దేశం మొత్తాన్ని గుజరాత్‌గా మలచాలని లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు భావిస్తున్నారు. మూడో ఊహ ఏమిటంటే, శరద్‌ పవార్‌ ఎన్సీపీ వంటి పార్టీలు మహారాష్ట్ర షుగర్‌ కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధించడం ద్వారానే రాష్ట్ర రాజ కీయాల్లో తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. ఈ కో-ఆపరేటివ్‌లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని మునుపటి ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు.

అయితే ఇది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాబోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్‌ సంస్థలు బలంగా ఉంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, గ్రామీణులపై బీజేపీ, ఎన్డీఏ పట్టు సడలిపోయిన సమయంలో కో-ఆపరేటివ్‌లు వారికి ఒక దారి చూపుతున్నట్లుంది. ఇప్పటికే రైతుల ఆందోళనలు వ్యవసాయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని బలహీనపర్చాయి. తిరిగి మండీల బాట పట్టడానికి బదులుగా కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధిస్తే ఆ వ్యవస్థ మొత్తాన్నే కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు మాత్రమే కాకుండా ఇతర ఎన్నికలకు కూడా కో-ఆపరేటివ్‌లు ఎక్కువ నిధులను అందించే అవకాశం మెండుగా ఉంది అని గుజరాత్‌ పరిశీలకులు ఒకరు చెప్పారు. కో-ఆపరేటివ్‌ సొసైటీల కేంద్ర రిజిస్ట్రార్‌ను మంత్రిత్వ శాఖ గుప్పిట్లో పెట్టుకుంటే రాష్ట్రాల కో-ఆపరేటివ్‌ సొసైటీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. అయితే కేంద్రం కో-ఆపరేటివ్‌ సంస్థలను ఎలా అదుపుచేస్తుంది అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి. వచ్చే ఆరు నెలల్లోనే సహకార సంస్థలపై సంచలన చట్టం రూపకల్పనను మనం చూడవచ్చు. దేశం సాధించిన అద్భుత విజ యాల్లో సహకార సంస్థలు కూడా ఒకటి. కానీ రాజకీయ హైజాకింగ్‌ వల్ల ఇవికూడా స్వయంపాలనను కోల్పోయి తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో రాజకీయ నాయకులు మాత్రమే లాభపడి, దేశ ప్రజలు నష్టపోయే రోజులు రాబోతున్నాయన్నదే అందరి ఆందోళన. దీంతో కో-ఆపరేటివ్‌లను అంతర్జాతీయంగా పోటీపడేలా రూపుదిద్దడం అనే సవాలు కూడా ప్రశ్నార్థకం కానుంది.


ఎమ్‌. రాజశేఖర్‌
వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు (‘ది వైర్‌’ సౌజన్యంతో..)

మరిన్ని వార్తలు