‘చౌరస్తా’లో రాజ్యాంగ విలువలు

12 Jul, 2022 00:36 IST|Sakshi

రెండో మాట 

దేశంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు పడిపోతున్న ప్రజాస్వామిక విలువలను సూచిస్తున్నాయి. అసహనాన్ని సూచిస్తున్నాయి. న్యాయంగా ఉండటానికి రోజులు కావని చెబుతున్నాయి. ఇది కొత్త రాజకీయ వాదనలు చేయడానికి కారణమవుతోంది. నిజానికి ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూలం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. అంబేడ్కర్‌ ఆశించినట్టుగా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ విడివడిన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగలేదు. వామపక్షాల మధ్య ఐక్యత కొరవడిన ఫలితంగా బలమైన ఉద్యమాలు లేక జనం మితవాద పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది మౌనం వీడాల్సిన సమయం.

‘‘తమిళనాడును స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థితికి మా తమిళనాడును నెట్టవద్దు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకునే స్థితికి మమ్మల్ని నెట్టవద్దు. స్వపరిపాలనా ప్రాంతంగా తమిళనాడును కేంద్రం ప్రకటిం చాలి. అందాకా మేము విశ్రమించేది లేదు. తమిళనాడు వేరే దేశంగానే వృద్ధి చెందాలన్న పెరియార్‌ విశ్వాసం వైపుగా మమ్మల్ని నెట్టవద్దు.’’
– సీఎం ఎం.కె. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే సీనియర్‌ నాయకుడు, నీలగిరి పార్లమెంట్‌ సభ్యుడైన ఎ.రాజా (4 జూలై 2022).

‘‘ద్రవిడియన్‌ ప్రాంతీయ పార్టీ రాజకీయాల వైఫల్యాన్ని డీఎంకే నాయకుడు రాజా ఆమోదించినట్టే’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి. రవి దీనికి స్పందించారు. రాజా ప్రకటన దేశ విభజనకు దారితీసే పచ్చి చీలుబాట రాజకీయమని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మౌనంగా ఉండిపోవడాన్ని ఖండిస్తున్నాననీ, రాజ్యాంగానికి బద్దులై ఉంటానని హామీపడి కూడా స్టాలిన్‌ ప్రేక్షకుడిగా ఉండిపోయారనీ తిరుపతి అన్నారు.

నిజానికి దేశంలో ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూల మంతా ఎక్కడ ఉందో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. వేర్పాటు ధోరణుల మూలం అంతా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఉందని దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలు ఇప్పటికే గ్రహించాయి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. కేంద్రాధి కారంలో ఉన్న రాజకీయ పక్షాల ఉసురును ఇంతవరకూ కాపాడి నిలబెడుతున్న ఏకైక ‘చిట్కా’ – యూపీలోని 80 లోక్‌సభ సీట్లు. ఈ ‘గుట్టు’ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటానికే ఉత్తర– దక్షిణ భారతదేశాల మధ్య గండి కొట్టాల్సిన అవసరం పాలకులకు అనివార్యం అయిపోయింది. 

భారతదేశ పాలనలో ఈ ‘గుట్టు’ను కాస్తా పసిగట్టి ‘రట్టు’ చేసిన తొలి దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్‌. కనుకనే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్‌ నగరాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని అంబేడ్కర్‌ కోరారని మరచి పోరాదు. అప్పుడుగానీ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్ల ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్ర పాలకులు నిరంతరం తలపెడుతున్న అన్యాయానికి అడ్డుకట్టు వేయడం సాధ్యపడదు. అందుకే అంబేడ్కర్‌ ప్రతిపాదనకు (దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్‌) అంతటి విలువ! ఈ దృష్టితో చూస్తే డీఎంకే నాయకుడు ఎ.రాజా ఆందోళనను కూడా తప్పుగా అర్థం చేసుకోనక్కర్లేదు. 

అంబేడ్కర్‌ 1956లో విస్తృత స్థాయిలో భారత రిపబ్లికన్‌ పార్టీని ఏర్పరచి, దానిని లౌకిక (సెక్యులర్‌) ప్రాతిపదికపైన ‘సోషలిస్టు ఫ్రంట్‌’గా తీర్చిదిద్దారు. బౌద్ధంలోని హేతువాద సూత్రాల అండ దండలనూ తోడు చేసుకున్నారు. తద్వారా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ, మూఢ విశ్వాసాల నుంచీ, సామాజిక దురన్యాయాల నుంచీ విడివడిన కుల రహిత సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని ఆశించారు. అందువల్లే వ్యవసాయ రంగంలోని పేద రైతాంగ వర్గాలనూ, సామాజికంగా వెనుకబడిన, నిరక్ష్యానికి గురైన వర్గాలనూ ఆకర్షించగలిగారు. అయితే అప్పటికి కుల వర్గ విభేదాలనూ, దౌర్జన్యాలనూ, హింసాకాండనూ బలంగా ఎదురొడ్డి, అగ్రకుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడగల బలవత్తర ఉద్యమాలు లేకపోవడంవల్ల... దళిత, బహుజన, పేద వర్గాలు మితవాద రాజకీ యాల వైపు ఆకర్షితులవుతూ వచ్చిన ఉదాహరణలూ ఎన్నో అని ప్రొఫెసర్‌ హరీష్‌ వాంఖడే (జేఎన్‌యూ ప్రొఫెసర్‌) అభిప్రాయం. 

ఆ మాటకొస్తే అప్పుడే కాదు, ఇప్పటి వర్తమాన రాజకీయాల లోనూ ఇదే పరిస్థితి. వామపక్షాల మధ్య ఐక్యత, ఏకవాక్యత కొరవడిన ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు పలు అన్యాయాలకూ, దాష్టీకాలకూ బలి కావలసి వస్తున్న సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజుకీ భూమి తగాదాల మిషపైన ఆదివాసీ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక ఆదివాసీ మహిళనుగానీ, పురుషుడినిగానీ దేశ రాష్ట్రపతి స్థానంలో ఒక పాలకవర్గ పార్టీ కూర్చోబెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ‘స్టాంపు డ్యూటీ’తో నిమిత్తం లేకుండా, కేవలం ‘రబ్బర్‌ స్టాంప్‌’గా రాష్ట్రపతి ఉన్నంతకాలం దేశానికీ, ప్రజలకూ ఒరిగేదేమీ ఉండదు. 

బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ హయాంలో, లక్నోలోని 140 ఏళ్ల చరిత్రగల ఒక హయ్యర్‌ సెకండరీ స్కూలు, కళాశాల ఉన్నట్టుండి అంతర్ధానమై, వాటి స్థానంలో ఒక ప్రైవేట్‌ స్కూలు వెలిసింది. దాంతో విద్యార్థులు పాఠాలన్నీ రోడ్డుపైనే నేర్చుకోవలసిన గతి పట్టింది. స్కూలు పేరు మారిపోయింది. స్కూలు లోకి విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ రానివ్వలేదు. వందలాదిమంది ఆ బడి పిల్లలు గేటు బయటే కూర్చునివుంటే, రోడ్డుమీదనే టీచర్లు పాఠాలు చెప్పాల్సిన గతి పట్టింది. ‘పేరు ధర్మరాజు, పెను వేప విత్తయా’ అన్నట్టు ప్రసిద్ధ చరిత్ర గల ఆ పాఠశాలకు బీజేపీ పాలకులు ఎందుకు ఆ గతి పట్టించారంటే – లక్నోలో ప్రసిద్ధికెక్కిన ఆదర్శ విద్యావేత్త రెవరెండ్‌ జేహెచ్‌ మెస్‌మోర్‌ ఆ పాఠశాలను నెలకొల్పి ఉండటమే!

అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్‌.పి. సందేశ్‌ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)ను విమర్శిస్తూ, అవినీతికి పాల్పడిన ఒక అధికారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే నిజాయితీపరుడైన న్యాయమూర్తి సందేశ్‌కు దక్కిన ప్రతిఫలం – బదిలీ ఉత్తర్వులు! బదిలీకి సిద్ధంగా ఉన్నానని సందేశ్‌ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ సంద ర్భంగా, ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నిస్తూ సందేశ్‌ చేసిన ప్రకటన దిమ్మ తిరిగిపోయేలా ఉంది: ‘‘ఇంతకూ మీరు ప్రజల ప్రయోజనాల్ని రక్షిస్తున్నారా లేక అవినీతితో గబ్బు పట్టిపోయిన అధికారుల్ని కాపాడుతున్నారా? ఈ నల్ల కోట్లు ఉన్నవి అవినీతిపరుల్ని రక్షించడానికి కాదు. లంచగొండితనం, అవినీతి క్యాన్సర్‌ వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ఇక ఆఖరి దశ వరకూ పాకడానికి వీల్లేదు’’ అని హెచ్చరించారు.

ఇక గుజరాత్‌ అల్లర్లానంతరం నరేంద్ర మోదీని ఒకప్పుడు సుప్రీంకోర్టు ‘నయా నీరో’గా విమర్శించింది. కానీ, అదే గుజరాత్‌ కేసులో మోదీకి ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం’ ఇచ్చిన ‘క్లీన్‌ చిట్‌’ సరైనదేనంటూ సుప్రీం ఇటీవల చెప్పడం మరో చిత్రమైన ట్విస్టు. కాగా, ఈ సందర్భంగా 92 మంది సుప్రసిద్ధులతో కూడిన రాజ్యాంగ పరిరక్షణా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది: ‘‘ఇంతకూ 2002 నాటి గుజరాత్‌ ఊచకోతలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నివేదికలు, నాటి సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారైన ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్‌ సమర్పించిన ప్రత్యేక నివేదిక ఏమైనట్టు?’’ అని రాజ్యాంగ పరిరక్షణ మండలి ప్రశ్నించింది.

ఈ 92 మంది ఉద్దండులలో సమాచార శాఖ మాజీ కమిషనర్‌ హబీబుల్లా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సునీల్‌ మిత్రా, హోంశాఖ మాజీ కార్య దర్శి జి.కె. పిళ్ళై, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్, తదితర పెక్కుమంది మాజీ ప్రధాన కార్యదర్శులూ, రిటైర్డ్‌ రాష్ట్ర పోలీస్‌ అధికారులూ ఉన్నారు. ఆ ప్రకటనలో వారిలా పేర్కొ న్నారు: ‘‘జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించి, వాటిని కాపాడుకోవడం పౌరుల విధి.’’ అందుకే ‘మౌనం’ అనేది ఒక్కో సందర్భంలో మంచికి దోహదం చేయొచ్చు. ఇంకొన్ని చోట్ల ఆ లక్షణమే మానవుడి ఉనికికే ప్రమాదభరితం కావొచ్చు.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు