ఓర్పుకీ... ఓదార్పుకీ చిరునామా!

21 Dec, 2023 05:05 IST|Sakshi

సందర్భం

ఆయన పేరు... లక్షల గుండెల్లో ఒక లయ. కోటి తలల నాలుక. జయ జయ ఘోషల పల్లవి. కడలి హోరు లాంటి కరతాళ ధ్వనుల గీతిక! కష్టజీవికి ఇరువైపులా నిలిచిన వాడు. కర్మ జీవికై పాలన మలచిన వాడు. ఫ్యూడల్‌ శక్తుల కుహనా ఎత్తుగడలను ఎదిరించి గెలిచినవాడు. పాతికేళ్లకే ప్రతిభావంతుడు. సంపదల మధ్య పుట్టిన జగన్‌ మోహనుడు. కుట్ర రాజకీయాల ‘బంధం’లో బాధల గరళం మింగిన బాధాసర్ప దష్టుడు. కసిని అసిగా మార్చు కుని అసిధారావ్రతం చేసి, జయకేతనం ఎగురవేశాడు. అయితే ఈ విజయం ఆయన్ని తేలిగ్గా వరించలేదు.

ఒకవైపు విషశక్తుల కుయుక్తులు ఎదుర్కొంటూనే జనసాగర తరగలపై తేలియాడిన నావికుడు. బాటలు నడిచి పేటలు కడచి వేలమైళ్ళ దుమ్ములో, మధ్యాహ్నపు సూర్య ధూళిలో స్నానమాడిన నిత్య పథగాముడు. అధో జగత్‌ సహోదరుల కష్టాలను కన్నాడు. గోడు విన్నాడు. అబలల కంటి తడి వీణ మీటాడు. అందుకే ఓర్పుకీ, ఓదార్పుకీ ‘జగన్‌’ అనే మూడు అక్షరాలు చిరునామా అయ్యాయి! సగటు ప్రజల మనో భావన భవన ప్రాంగణాల కట్టిన తోరణాలే ‘నవరత్నా’లై నిలిచాయి.

సహజంగానే ప్రతిభావంతులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ముద్ర ఉంటుంది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నా తండ్రి చాటు బిడ్డగా రాజకీయం నడపలేదు. జనంతో కలిసి, జనంతో మమేకమై, జన ఘన జన నేతగా జగన్‌ ఆవిష్కృతమయ్యాడు. కుహనా శక్తులకు సింహ స్వప్నమయ్యాడు. సమ సమాజ చైతన్యానికి తెరలేపి, సామాజిక చైతన్యం అంటే ఏమిటో చాటి చెప్పాడు.

ఈ చైతన్యం ఫ్యూడల్‌ శక్తులకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దశాబ్దాల తమ పెత్తందారీ తనానికి ఎదురు నిలవడం సహించలేని శక్తులు అన్నీ ఒక్కటయ్యాయి. బుస కొట్టే భుజంగాలూ, ఘుర్ఘరించే ‘వరాహాలూ’, నక్కలూ, భల్లూకాలూ, ఉలూకాలూ ఒక్క టయ్యాయి. రాజ్యం తమ భోజ్యం కావాలని పద్మ వ్యూహాలను పన్నుతున్నాయి. కానీ వారికి తెలియదు జనార్దనుడికి పద్మవ్యూహం పటా పంచలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని!

అయితే సగటు ప్రజలు కూడా ఈ కుట్రలు గ్రహించాలి. స్వేదంతో నిర్మించుకున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అందరి విధి. పరిపాలన అంటే ‘ఆకాశ హార్మ్యాల నిర్మాణం, విదేశీ శక్తులకు ఆహ్వానం, లక్షల కోట్లు దోచేయడం’ అనే సంస్కృతికి వీడ్కోలు చెప్పి, అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యంగా సాగిపోతున్నాడు జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే ఈ ప్రయాణం పూల పాన్పు కాదు. ఎన్నో అవరోధాలూ, సవాళ్లూ ఉన్నాయి. అయినా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సాగుతున్నాడు.

మరి ఆ సంక్షేమ ఫలాలు అందని అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? ఇక్కడే అసంతృప్తులు వివేకంతో ఆలోచించాలి. పరిపాలన అంటే సంపన్న వర్గాలు కోటానుకోట్లు దోచుకుంటూ పేదలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ, వాళ్లకు ఎంగిలి మెతుకులు విసరడం న్యాయమా? అసలు అంటూ సంక్షేమ ప్రభుత్వం వచ్చాక, ఆ ఫలాలు తమ సాటివారికి అందుతున్నప్పుడు, తమ వంతు కూడా వస్తుందనే విశాల దృక్పథంతో ఆలోచించాలి.

ఎందుకంటే అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం జగన్‌కి ఉండవచ్చు. కానీ అందుకు ఆయన చేతిలో మంత్రదండం ఏమీ లేదు. అందుకే సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ కొనసాగింపు తమ వరకు వచ్చేదాకా ఫలాలు అందని వారు ఓపిక పట్టడం ఎంతో అవసరం. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి.

ఇవి మరింత విస్తృతం కావాలి అంటే ‘మళ్లీ జగన్‌ రావాలి!’ ఈ నేపథ్యంలో ఛద్మ వేషధారులు బయలుదేరి, కవి ఆలూరి బైరాగి చెప్పినట్టు, ‘నాకు కొంచెం నమ్మకమివ్వు కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టమేటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుని ఆకాశపు ఎంగిలి పళ్లెంలో నుంచి నెట్టేస్తాను’ అంటూ వీరంగాలు వేస్తున్నారు.

‘ఎర్ర పుస్తకాలతో’, ‘ఎర్రి’ ప్రసంగాలతో వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు. ఇంకోవైపు వీరికి చెందిన కార్పొరేట్‌ శక్తులు ఒకటయ్యాయి. దశాబ్దాలుగా తాము నంజుకు తింటున్న ప్రజా సంపద పేదలకు వెళ్లడం జీర్ణించుకోలేక పోతున్నాయి. గోబెల్స్‌ ప్రచారంతో జగన్‌పై చీకటి యుద్ధం ప్రారంభించాయి.

ఇది జగన్‌ చెప్పినట్లు అచ్చంగా ‘క్లాస్‌ వార్‌’. పేదల ప్రభుత్వంపై పెద్దలు ప్రకటించిన యుద్ధం. ఒకవైపు పీడిత, తాడిత జన అక్షౌహిణుల ప్రతినిధిగా జగన్‌ నిలబడగా ఆయనతో కలబడుతున్న శక్తులు అత్యంత బలమైన కుహనా శక్తులు. ఒకే తానుకి చెందిన ఈ శక్తులు జ్యుడీషియరీ, మీడియా, ఎగ్జిక్యూటివ్, బిజినెస్, సినిమా... ఇలా ఒకటనేమిటీ? అన్ని రంగాలనుంచి మూకుమ్మడి దాడి ప్రారంభించాయి. అయితే ఈ కుట్ర రాజకీయాలకు అదిరే బెదిరే వ్యక్తి కాదు జగన్‌.

ఇప్పుడు జగన్‌ నడుపుతున్నది సంప్రదాయేతర రాజకీయం. ఇది అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. రాజకీయం అంటే కొద్దిపాటి వర్గాల సొత్తు అనీ, పాలన అంటే కొన్ని వర్గాలు మాత్రమే తర తరాలకు సరిపోను సంపద కూడబెట్టుకోవడం అనీ, పాలకులు వేరు, పాలితులు వేరు అనే ఫ్యూడల్‌ సంప్ర దాయ రాజకీయాలకు చెక్‌ చెప్పి, ‘సంక్షేమ రాజ్యం’ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లోనే ఒక విలక్షణ పాలకుడు, సలక్షణ నాయకుడు. ఆయన జన్మ దినోత్సవ సందర్భంగా, పెద్దలు ‘జీవేమ శ్శరదమ్‌ శతమ్‌...’ అని దీవిస్తున్న వేళ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు!!
పి. విజయబాబు 
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులు

>
మరిన్ని వార్తలు