సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!

6 Sep, 2022 00:35 IST|Sakshi

2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్‌ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 

స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. 

ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్‌ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్‌ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. 

పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. 

అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి.

విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. 

సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 

2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్‌ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్‌ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్‌ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర‍్పాటు చేయాలంటే.. ప్రైవేట్‌ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్‌ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి.

2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ...  స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు.

గగన్‌దీప్‌ కాంగ్‌, వ్యాసకర్త సీనియర్‌ వైరాలజిస్ట్‌ (‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు