కాంగ్రెస్‌ పాఠం నేర్చేనా?

6 Dec, 2023 04:45 IST|Sakshi

అభిప్రాయం

మూడు హిందీ ప్రాంత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ సాధించిన అద్భుతమైన విజయం ఎన్నికల విజయం మాత్రమే కాదు. ఇది భారత రాజకీయాల వర్తమానంతోపాటు భవిష్యత్తు గురించి కూడా వివిధ వ్యక్తావ్యక్త సందేశాలను కలిగి ఉంది. ఉత్తర భారతదేశంలో ఆ పార్టీకి భారీఎత్తున ప్రజాభి మానం ఉందని బీజేపీ విజయాలు తెలియజేస్తున్నాయి. హిందీ ప్రాంత ఓటర్లతో ఆ పార్టీ అంత లోతైన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలిగింది, ముఖ్యంగా బీజేపీపై ప్రజల విశ్వాసం గురించి ఈ ఫలితాల నుండి వెలువడుతున్న పెద్ద సందేశం ఏమిటి?

సాంఘిక సంక్షేమ రాజకీయం, రిజర్వేషన్లకు సంబంధించి కులగణన కేంద్రక రాజకీయాలు అనే రెండు ప్రధాన అంశాలను కేంద్రంగా చేసుకొని ఈ ఎన్నికలు జరిగాయి. సంక్షేమ చర్యల రాజకీయాలను ప్రధాన పోటీదారులైన బీజేపీ, కాంగ్రెస్‌లు అనుసరించాయి. బీజేపీ తన ప్రణాళికా బద్ధమైన ఎన్నికల ప్రచారం ద్వారా, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో కలిగే ప్రయోజనాలను ప్రచారం చేసింది.

ఒకే సమయంలో కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నందున కలిగిన ప్రయోజనాలను ప్రచారంలో ఎత్తి చూపింది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విశేషించి పేర్కొన్నారు కమలనాథులు.

కాంగ్రెస్, బీజేపీలు తమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారిని ఎవరికి వారు తయారుచేసుకోగలి గాయి. కానీ కాంగ్రెస్‌ ఇంకా తన లబ్ధిదారులతో రాజ కీయ సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోలేదు. అయితే, బీజేపీ తన లబ్ధిదారులను ఒక సంఘంగా – ఒక సముదాయంగా–వారితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంది. మామా, లాడ్లీ బెహనా (ప్రియమైన సోదరి) వంటి కుటుంబ సంబంధ పదజాలాన్ని వాడటం ద్వారా, వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా బీజేపీ ఈ పని చేయ గలిగింది. పార్టీ కార్యకర్తలు వివిధ పథకాల లబ్ధిదారులతో హోలీ, దీపావళి, రక్షా బంధన్‌ వంటి పండు గలను జరుపుకోవడం ప్రారంభించారు.

తన వంతుగా,కాంగ్రెస్‌ కూడా పేద ప్రజలకు పథకాలను అందించింది, కానీ వారితో దీర్ఘకాలిక భావోద్వేగ సంబం ధాన్ని ఏర్పరచుకోలేకపోయింది. హిందీ ప్రాంత వాసి మనస్సు... తనతో గౌరవంగా, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న పార్టీతో స్పష్టంగా కనెక్ట్‌ అయి ఉంటుంది. బీజేపీ రాజకీయ పదజాలం... ఆర్థిక సమస్య లనూ, అభివృద్ధినీ అట్టడుగు స్థాయిలో ప్రతిధ్వనించే సాంస్కృతిక, సామాజిక భావోద్వేగాల చట్రంలో రూపొందించింది.

రెండవది – గ్రామీణ భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు నమ్మకం చాలా ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయాలతో ప్రజలలో మత, సాంస్కృతిక భద్రతకు భరోసా కల్పించడం ద్వారా వారిలో అపారమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఎన్నికలలో కూడా మోదీ తనకు తానుగా ప్రచారానికి పూను కుని, ఓటర్లకు ‘నేను ఇక్కడ ఉన్నాను, నేను మీ కోసం పని చేస్తాను’ అనే భరోసా ఇచ్చే రిస్క్‌ తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించకుంటే అది మోదీ ప్రతిష్ఠపై ప్రభావం చూపి ఉండేది. 

మూడవది – హిందూత్వం. బీజేపీ తన రాజకీయాలను హిందూత్వ భావనపై నిర్మించి, పునరుద్ధరించే ఆధార్‌ భావాన్ని (ఫౌండేషనల్‌ ఎమోషన్‌) ను హిందువులు అధికంగా ఉన్న హిందీ ప్రాంత రాష్ట్రాల్లో అందించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన ప్రచారా యుధంగా మలచుకొంది. రామ్‌ భద్రాచార్య వంటి అనేక మంది సనాతన ధర్మ సాధువులు ఈ ఎన్నికలను ధర్మం, అధర్మాల మధ్య యుద్ధంగా అంచనా వేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కమల్‌నాథ్‌ నియోజకవర్గమైన ఛింద్‌వారాలో జరిగిన ఓ మీటింగ్‌లో తమ ధర్మాన్ని కాపాడే పార్టీకి మద్దతు ఇవ్వాలని రామ్‌ భద్రాచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సాధువులు తమ సమావేశాల్లో ఇచ్చిన ప్రవచనాలలో,డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. కాంగ్రెస్‌ను స్టాలిన్‌ పార్టీకి మద్దతుదారుగా చూపారు. అలా ఆ పార్టీని సనాతన విరోధిగా చిత్రించారు. సనాతన ధర్మంపై మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ వరకు సాగిన ఈ ప్రచారం హిందీ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసే ప్రజా కథనంగా ఉద్భవించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలోని గిరిజనులు, దళితులపై కూడా ఇది ప్రభావం చూపింది.

ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓటర్లను వారి కుల గుర్తింపుపై సమీకరించేందుకు కుల గణన డిమాండ్‌పై కాంగ్రెస్‌ ఎక్కువగా ఆధారపడింది. ఈ ఎన్నికల్లో దాని వ్యూహం పూర్తిగా విఫలమైంది. హిందీ ప్రాంత రాష్ట్రాల్లో కులం ప్రభావం కొనసాగుతోంది. కానీ ప్రజల మూడ్‌ మారిందని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ఇది బహుళ ఆకాంక్షల యుగం.

కుల చైతన్యం ఒక ఆకాంక్ష మాత్రమే. ‘కుల గుర్తింపు తర్వాత ఏమిటి’అనేది ఓటర్ల మనసులోని ప్రశ్న. బీజేపీ ఇకపై బ్రాహ్మణ–బనియా పార్టీ కాదనే వాస్త వాన్ని కాంగ్రెస్‌ కూడా అంగీకరించలేదు, బీజేపీ నాయకత్వంలో ఓబీసీలు ఉన్నారు. కాబట్టి, కుల గణన ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఓబీసీల సంఘటిత సమీకరణ దాదాపు అసాధ్యం.

ఈ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇవి ముఖ్యంగా హిందీ ప్రాంతంలో తన వ్యూహాలు, ప్రజలతో రాజకీయంగా వ్యవహరించే తీరు (డిక్షన్‌) గురించి పునరా లోచించడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తాయి. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు ఇరుసుగా కాంగ్రెస్‌కు దాని స్థానం దానికి ఉండవచ్చు. అయితే, కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియల్లో జరిగే చర్చలు, ప్రాధా న్యాలను ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. తాజా ఫలితాలు ప్రధాని మోదీ ప్రతిష్ఠను బలోపేతం చేశాయి. ఇది నిస్సందేహంగా బీజేపీపై సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది.
బద్రీనారాయణ్‌ 
వ్యాసకర్త అలహాబాద్‌లోని ‘గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ సోషల్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌’లో ప్రొఫెసర్‌

>
మరిన్ని వార్తలు