మాతృ మరణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు

21 Nov, 2023 02:08 IST|Sakshi
జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: మాతృమరణాల నివారణకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ క్రమంలో ఎవరి నిర్లక్ష్యం కారణంగానైనా ఇబ్బందులు ఏర్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా మాతృమరణాల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులకు ముఖ్యంగా రక్తహీనత ఉన్న వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గత జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్యలో జిల్లాలో తెనాలి, గుంటూరు, మేడికొండూరు, పొన్నూరు పీహెచ్‌సీల్లో 6 మాతృ మరణాలు సంభవించాయన్నారు. దీనిపై వైద్య అధికారులు విచారించి బాధిత కుటుంబాలతో మాట్లాడాలన్నారు. మరణాలకు కారణాలను విశ్లేషించి మళ్లీ అటువంటి పొరపాట్లు జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గర్భిణులు సుఖంగా ప్రసవించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసిందన్నారు. గర్భిణులు మూడో నెల నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సమస్యలుంటే అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎం, సచివాలయ సిబ్బందికి తెలపాలని చెప్పారు. పౌష్టికాహారంతోపాటు రక్తశాతం తప్పక చూసుకోవాలన్నారు. ఇబ్బందులను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ వివరించారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌ బాబు, మాతృమరణాల కమిటీ సభ్యురాలు రాధిక రాయుడు, జాతీయ ఆరోగ్య మిషన్‌ జిల్లా అధికారి డాక్టర్‌ రత్న మన్‌మోహన్‌, ఐసీడీఎస్‌ పీడీ ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు.

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత..

గుంటూరు వెస్ట్‌: పిల్లల బంగారు భవిష్యత్తు సమాజానికి ఎంతో ముఖ్యమని, దీనిని కాపాడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాల కార్మికులను గుర్తించే టాస్క్‌ఫోర్స్‌ వాహనాన్ని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్‌ఓ చంద్రశేరరావుతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ చైల్డ్‌ లేబర్‌ ఆదేశాల మేరకు వచ్చే నెల 10 వరకు బాల కార్మికులను గుర్తించేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే ఇప్పటికే విద్యా శాఖ ఐదు సంవత్సరాల వయస్సున్న చిన్నారులను గుర్తించి వారిని విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యనందిస్తుందన్నారు. ఇతరులు బాల కార్మికులను గుర్తిస్తే 1098 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సమాచారమందించాలన్నారు. ఆర్డీఓ పి.శ్రీకర్‌, ఐసీడీఎస్‌ పీడీ ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు.

న్యుమోనియా అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ..

గుంటూరు మెడికల్‌: 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వచ్చే న్యుమోనియాపై జరిగే అవగాహనా కార్యక్రమంపై ప్రచార పోస్టర్‌లను జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాలరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీపీఎంఓ డాక్టర్‌ చుక్కా రత్న మన్మోహన్‌, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అన్నపూర్ణ, డీఐఓ డాక్టర్‌ కె.వి సుబ్బరాజు, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు, డాక్టర్‌ లక్ష్మానాయక్‌, డాక్టర్‌ విజయ ప్రకాష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు