పత్తి తూకంలో ‘రిమోట్‌’ మోసం! ఓ దళారీ రెడ్‌ హ్యాండెడ్‌గా..

31 Oct, 2023 10:18 IST|Sakshi

రూ.100 ఎరవేసి..

తూకంలో 15 కిలోలు కోత!

గుర్తించిన పత్తి రైతులు..

మోసగాడికి దేహశుద్ధి!

సాక్షి, వరంగల్: కాంటాలో సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి రిమోట్‌ ఆపరేషన్‌ సహాయంతో తూకంలో మోసం చేస్తున్న ఓ దళారీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తమను మోసం చేశాడని ఆగ్రహంతో రైతులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన హసన్‌పర్తి మండలం నాగారంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల పరిధి అంబాలకు చెందిన ప్రైవేట్‌గా వ్యాపారి గడ్డం వెంకటేశ్వర్లు పరకాల, సూదన్‌పల్లి, పెంబర్తి, అంబాల, కమలాపూర్‌, శ్రీరాములపల్లి గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి అక్కడే పత్తి తూకం వేసి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నాడు.

మార్కెట్‌ ధర కంటే మరో రూ.100 అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు ఆసక్తితో ముందుకు వచ్చారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న అంబాలకు చెందిన కర్ణాకర్‌ తన యజమాని సూచన మేరకు రెండు నెలలుగా ఆయా గ్రామాలకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. అయితే వచ్చిన దిగుబడికి.. తూకం వేసిన తర్వాత వ్యత్యాసం కనిపించినా రైతులకు ఏం జరుగుతున్నదో అర్థం కావడంలేదు.

మోసాన్ని గుర్తించింది ఇలా..
సోమవారం ఉదయం నాగారంలోని రాజిరెడ్డి ఇంటికి కర్ణాకర్‌ వచ్చి పత్తి కాంటా వేశాడు. తొలుత 92.6 కిలోల తూకం వచ్చిన పత్తి.. సెకండ్ల వ్యవధిలోనే 74.1 కిలోలకు చేరింది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గుమస్తా చేతులను పరిశీలించారు. ఏదో జరుగుతున్నదని గమనించి వెంటనే అతడి జేబులను తనిఖీ చేయగా రిమోట్‌ దొరికింది. దీంతో భయపడిన గుమస్తా ఆ రిమోట్‌ను బయటికి విసరగా.. రాజిరెడ్డి కుటుంబ సభ్యులు వెతికి తీసుకుని వచ్చారు.

ఎలక్ట్రానిక్‌ కాంటాకు రిమోట్‌ కనెక్షన్‌..
సదరు దళారీ ఎలక్ట్రానిక్‌ కాంటాను రిమోట్‌ కనెక్షన్‌ ఇచ్చాడు. పత్తి తూకం వేసినప్పుడు జేబులో నుంచి ఒకసారి రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తే 15 కిలోలు, రెండుసార్లు చేస్తే 30 కిలోలు తక్కువ తూకం వచ్చేలా కాంటాలో సాంకేతిక పరికరాన్ని బిగించి రిమోట్‌కు అనుసంధానం చేశాడు.

ఓవైపు రైతులు తూకం నమోదు చేస్తుండగా.. మరో వైపు దళారీ రిమోట్‌తో ఆపరేట్‌ చేయడంతో క్వింటాకు 15 కిలో ల నుంచి 30 కిలోల పత్తి తగ్గుతోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కర్ణాకర్‌ను రైతులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తన యజమాని వెంకటేశ్వర్లు సూచన మేరకు రిమోట్‌ వాడుతున్నట్లు తెలిపారు. అప్పుడే అక్కడికి చేరిన వెంకటేశ్వర్ల్లును రైతులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియనట్లుగా నటించడంతో రైతులు అతడికి కూడా దేహశుద్ధి చేశారు.

గుర్తించకుంటే..
పత్తి తూకం వేయగా 92.6 కిలోలు వచ్చింది. ఆ వెంటనే 74.1 కిలోలకు తగ్గింది. అనుమానం వచ్చి అతని జేబులు పరిశీలించగా రిమోట్‌ కనిపించింది. గుర్తించకుంటే మూడు క్వింటాళ్ల పత్తి మాయమయ్యేది. – రాజిరెడ్డి, రైతు

మూడు క్వింటాళ్లు మాయం..
ఇటీవల మార్కెట్‌ ధర కంటే వంద రూపాయలు అదనంగా ఇస్తామంటే ఇంటి వద్ద పత్తి అమ్మిన. అయితే 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. తూకంలో 12 క్వింటాళ్లు వచ్చింది. తూకంలో మోసం చేసి మూడు క్వింటాళ్ల పత్తి మాయం చేశాడు. – లింగారెడ్డి, రైతు

మరిన్ని వార్తలు